నర్సీపట్నం టికెట్ కోసం మారుతున్న రాజకీయం – అయ్యన్న వారసత్వం ముందుకు దూసుకెళ్తుందా?
ఉమ్మడి విశాఖ జిల్లాలోని సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు – తెలుగు దేశం పార్టీ (టీడీపీ)కి వీథి నుండి వీధి వరకు పరిచయం ఉన్న పేరు. ఆయన రాజకీయ జీవితం పార్టీ ఆవిర్భావం నుంచే ప్రారంభమైంది. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు పదకొండుసార్లు పోటీ చేసి ఎనిమిదిసార్లు విజయం సాధించారు. ఆయన్ను టీడీపీ పాలనలో కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించిన నేతగా గుర్తించవచ్చు. రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాలు గడిపిన అయ్యన్న ప్రస్తుతం రాజకీయ విరమణ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇప్పుడు స్పీకర్ బాధ్యతల నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాలనుంచి పక్కకు తగ్గిన అయ్యన్న, తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు విజయ్ పాత్రుడికి అప్పగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. విజయ్ వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఆయన చేసిన భావోద్వేగ భరితమైన ప్రకటన పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
“నర్సీపట్నం మా కుటుంబాన్ని దశాబ్దాలుగా ఆదరిస్తోంది. మేము టీడీపీలో పుట్టాం, టీడీపీలోనే మరణిస్తాం,” అంటూ విజయ్ పాత్రుడు అన్నారు. తాను టీడీపీ జెండా చూస్తూ పెరిగానని, అదే జెండా నీడలో ఇప్పుడు పనిచేస్తున్నానని తెలిపారు. తన కుటుంబం టీడీపీకే అంకితమైందని స్పష్టం చేస్తూ, నర్సీపట్నం టికెట్ తమ కుటుంబానికే రావాలన్న ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు, బీజేపీ ఎంపీగా గెలిచిన సీఎం రమేష్, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి పదవిని లక్ష్యంగా పెట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి ఎంపీగా ఉన్న రమేష్ కన్ను నర్సీపట్నం మీద ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వెలమ సామాజిక వర్గం బలం ఉన్న సీటుగా నర్సీపట్నం భావిస్తున్నారు.
అయితే టీడీపీ ఈసారి నర్సీపట్నం టికెట్‌ను కుటుంబ వారసత్వానికి కాకుండా కొత్త ముఖానికి ఇవ్వవచ్చన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అయ్యన్న కుటుంబం మాత్రం తమ పట్టు వీడేలా కనిపించడం లేదు.
ఈ రాజకీయ గందరగోళం మధ్య, విజయ్ పాత్రుడు చేసిన ప్రకటన అతనికి పార్టీలో పట్టు ఉందని చూపించే ప్రయత్నమా? లేక, ఆస్తాన వారసత్వాన్ని రాబోయే ఎన్నికల్లో నిలబెట్టాలన్న వ్యూహమా? అన్నది ఆసక్తికరంగా మారింది.
2029 నర్సీపట్నం నియోజకవర్గం తుది రూపు ఎటు మలుస్తుందో చూడాల్సిందే.
