* కూటమిని ఆదరించిన మహిళలు..
2024 ఎన్నికల్లో మహిళలు కూటమిని ఆదరించడానికి ప్రధాన కారణం ఉచిత బస్సు ప్రయాణ పథకం( free bus scheme ). ముందుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఉచిత ప్రయాణ పథకాన్ని ఇచ్చింది. దీంతో అక్కడ మహిళలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. అటు తరువాత తెలంగాణలో ఈ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా మహిళలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఎన్నికల్లో గెలిపించారు. ఆ రెండు చోట్ల ఉచిత ప్రయాణ పథకం అమలవుతోంది. అందుకే ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే మంత్రుల కమిటీని నియమించింది ప్రభుత్వం. కర్ణాటక తో పాటు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అధ్యయనం చేసింది మంత్రుల బృందం. తొలుత సంక్రాంతి నుంచి అని ప్రచారం జరిగింది. తరువాత ఉగాది నుంచి పథకాన్ని ప్రారంభిస్తారని టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా మరో రెండు నెలల్లో ఈ పథకం ప్రారంభం అవుతుందని మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ప్రకటించారు.
* రోజుకు 25 లక్షల మందికి లబ్ధి..
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు 25 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం అమలుతో ఏపీఎస్ఆర్టీసీ కి( APSRTC ) రోజుకు నాలుగు కోట్ల రూపాయల భారం పడవచ్చు. అయితే ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి సమకూర్చనుంది. మరో రెండు నెలల్లో ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే బస్సుల సంఖ్య భారీగా పెంచే అవకాశం కనిపిస్తోంది. పథకం అమలు కోసం అదనపు బస్సుల కొనుగోలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ తరహాలో రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారా? లేకుంటే జిల్లాలకే పరిమితం చేస్తారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
* క్షేత్రస్థాయిలో ఇబ్బందులు..
ప్రస్తుతం కర్ణాటకతో( Karnataka) పాటు తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు అవుతోంది. అయితే అక్కడ క్షేత్రస్థాయిలో చాలా రకాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉచిత ప్రయాణం అనేసరికి మహిళలు ఎగబడుతున్నారు. మహిళా ప్రయాణికులకు తగ్గట్టు బస్సులు వెయ్యలేకపోతున్నారు. అందుకే పూర్తిస్థాయిలో బస్సులు అందుబాటులోకి తెచ్చి.. ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పథకం ప్రారంభించిన తర్వాత 2029 ఎన్నికల వరకు కొనసాగించాలని చూస్తోంది.
