
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు భూమి కేటాయించడం పట్ల పారిశ్రామిక వర్గాల్లో, ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇది రాష్ట్రానికి పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను తీసుకురావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ప్రపంచ టెక్నాలజీ గమ్యస్థానంగా పెంచుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సానుకూల పరిణామం నేపథ్యంలో అదే సమయంలో విశాఖలో కొత్తగా ఏర్పాటైన ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు ₹5,728 కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం భారీగా 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడంపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ భూ కేటాయింపు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఇది విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తన బినామీల పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు పన్నిన పన్నాగమని ఆరోపిస్తూ ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని (చిన్ని) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంచలనాత్మక లేఖ రాశారు. ఈ లేఖలో నాని పలు కీలక ఆరోపణలు చేస్తూ, ఈ కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
-కేశినేని నాని లేఖలోని ముఖ్యాంశాలు:
కేశినేని నాని తన లేఖలో ఉర్సా క్లస్టర్స్ భూ కేటాయింపుపై తీవ్ర అనుమానాలను వ్యక్తం చేస్తూ, పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భూ కేటాయింపులకు కొద్ది వారాల ముందే ఏర్పాటైందని, ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన పూర్వానుభవం, విశ్వసనీయత, ఆర్థిక వనరులు కంపెనీకి లేవని నాని తన లేఖలో పేర్కొన్నారు. కేవలం భూమిని దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేశారని ఆయన పరోక్షంగా ఆరోపించారు. కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ కేశినేని శివనాథ్ కు అత్యంత సన్నిహితుడని, ఇంజనీరింగ్ క్లాస్మేట్ అని నాని గుర్తు చేశారు. అంతేకాకుండా గతంలో ప్రజల నుంచి కోట్లు వసూలు చేసి, మోసగించి మూతపడిన ’21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ & ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే వివాదాస్పద సంస్థలో శివనాథ్ కు అబ్బూరి సతీష్ వ్యాపార భాగస్వామి అని నాని తన లేఖలో స్పష్టం చేశారు. ఇది ఉర్సా క్లస్టర్స్ వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఎవరనే దానిపై అనుమానాలను బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉర్సా క్లస్టర్స్ వెనుక అసలైన వ్యక్తి ఎంపీ కేశినేని శివనాథ్ అని, ఎంపీగా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించి, పెట్టుబడుల ముసుగులో ఈ ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని బలమైన ఆరోపణలున్నాయని నాని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ శివనాథ్ ఇసుక, ఫ్లై యాష్, గ్రావెల్ మైనింగ్, జూద గృహాలు, రియల్ ఎస్టేట్ మాఫియాలలో లోతుగా పాలుపంచుకుంటున్నారని, ఈ అక్రమ కార్యకలాపాలన్నీ నారా లోకేష్ పేరు చెప్పి చేస్తున్నారని విస్తృతంగా ఆరోపణలు వస్తున్నాయని నాని తన లేఖలో తెలిపారు.
– ప్రభుత్వానికి కేశినేని నాని విజ్ఞప్తి:
ఈ భూ కేటాయింపు నిజమైన పారిశ్రామిక అభివృద్ధి కోసం కాదని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగత లాభం కోసం భూమిని కబ్జా చేసే ప్రయత్నమని కేశినేని నాని ఆరోపించారు. దీనిని అనుమతిస్తే ప్రజా ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా, పారదర్శక పాలన అందిస్తామని చెప్పుకునే ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చేసిన భూ కేటాయింపులను తక్షణమే రద్దు చేయాలని.. ఉర్సా క్లస్టర్స్ కంపెనీ యాజమాన్యం, నిధుల మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నాయకత్వాన్ని, పార్టీ పేరును దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్నారని, పెట్టుబడుల ముసుగులో ప్రభుత్వ భూములను దోచుకోకుండా కాపాడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని తాను విశ్వసిస్తున్నానని కేశినేని నాని తన లేఖను ముగించారు. కేశినేని నాని రాసిన ఈ లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దలపై, ముఖ్యంగా అధికార పార్టీ ఎంపీపై వచ్చిన ఈ తీవ్ర ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
-వినేంత తీరిక, చెప్పించుకునేంత ఖర్మ చంద్రబాబు కు లేదు : బుద్దా
ఉర్సా క్లస్టర్స్ భూ కేటాయింపుల విషయంలో విజయవాడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ఈ కేటాయింపులపై కేశినేని నాని చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా కేశినేని చిన్నిపై నాని ఆరోపణలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బుద్ధా వెంకన్న ఎదురుదాడికి దిగారు.ఎంపీ సీటు లభించలేదనే కారణంతోనే కేశినేని నాని మొదటి నుండి సొంత తమ్ముడు కేశినేని చిన్నిపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ వస్తున్నారని బుద్ధా వెంకన్న గుర్తు చేశారు. గతంలో నాని తన సొంత తమ్ముడి భార్యపైనే కేసు పెట్టారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రాభివృద్ధికి నాని అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కేశినేని శివనాథ్ (చిన్ని) ఇంజినీరింగ్ క్లాస్మేట్ కంపెనీ అయిన ఉర్సా క్లస్టర్స్‌కు భూమి ఇవ్వకూడదని నాని అడ్డుచెప్పడం సరికాదని ధ్వజమెత్తారు.
బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సి వస్తుందని, కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేసి, వేలాది కోట్ల రూపాయలకు పంగనామం పెట్టిన కేశినేని నాని ఇలాంటి నీతులు చెప్పడం హాస్యాస్పదమని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఎవరెవరికి ఏమి చేయాలో, ఏ పరిశ్రమలను ఎలా రాష్ట్రాంలోకి తీసుకురావాలో చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసునని బుద్ధా వెంకన్న అన్నారు. మధ్యలో నాని ఉపన్యాసాలు వినేంత తీరిక, ఆయనతో చెప్పించుకునేంత ఖర్మ చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన చేరినప్పుడు ప్రజలు ఛీ కొట్టిన విషయాన్ని నాని మరచిపోయినట్టున్నారని చురకలు అంటించారు. రాజకీయాలకు దూరమవుతానని గతంలో ప్రకటించి, ఇప్పుడు మళ్ళీ ఏం ఆశించి ఇలాంటి ట్వీట్లు చేస్తున్నావంటూ కేశినేని నానిని బుద్ధా వెంకన్న నిలదీశారు.