
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాన్ని భారీగా విస్తరించే ప్లాన్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికే దేశంలోని అత్యుత్తమ ఎయిర్ పోర్టుల్లో ఒకటిగా మారిన ఈ విమానాశ్రయం తన సత్తా చాటుతోంది. భవిష్యత్ అవసరాల కోసం రానున్న మూడేళ్లలో రూ.14వేల కోట్ల ఖర్చు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహా విస్తరణలో భాగంగా ఇప్పటికే ఉన్న టెర్మినల్.. రన్ వేకు అదనంగా కొత్త టెర్మినల్ .. రన్ వేను విస్తరించాలన్న ఉద్దేశంతో ఉన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదలయ్యే ఈ పనులు 2029 సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టును ప్రతి ఏడాది 3.4 కోట్ల మంది ప్రయాణికులు.. గంటకు 42 విమానాలు రాకపోకలు (టేకాఫ్, ల్యాండింగ్) సాగించేందుకు వీలుగా జీఎంఆర్ గ్రూపు నిర్మించింది. 2017-18 నాటికి ఏటా 1.83 కోట్ల ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఏటా 7.1 శాతం వ్రద్ధి రేటుతో గత ఏడాది ఇది కాస్తా 2.95 కోట్లకు చేరింది.
నిజానికి కరోనా కానీ లేకుంటే.. ఇప్పటి రద్దీ రెండేళ్ల కంటే ముందే ఉండేది. ప్రస్తుతం గంటకు రాకపోకలు సాగించే విమానాల సంఖ్య 36కు చేరింది. అంటే.. గరిష్ట పరిమితికి శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడున్న రద్దీ రానున్న రోజుల్లో మరింత పెరగటమే కానీ తగ్గే పరిస్థితి లేదు. దీంతో.. విమానాశ్రయాన్ని విస్తరించక తప్పని పరిస్థితి.
ప్రస్తుత టెర్మినల్ ప్రయాణికుల వార్షిక సామర్థ్యాన్ని 3.4 కోట్ల నుంచి4.7 కోట్లకు పెంచటంతో పాటు.. గంటకు 46 – 47విమానాలు రాకపోకలు సాగించేలా ఇంకో టెర్మినల్ ను .. 3800 మీటర్ల పొడవైన రన్ వే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కొత్తగా విస్తరించే విమానాశ్రయం ఆధునీకరణను అధునాత సదుపాయాలతో పూర్తి చేయాలని జీఎంఆర్ గ్రూపు భావిస్తోంది.ఇందులో భాగంగా రన్ వే సరిగా కనిపించకున్నా పైలెట్లు విమానాల్ని సురక్షితంగా ల్యాండింగ్ చేసే ఆధునాతన టెక్నాలజీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.