
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సాఆర్ ఆంజనేయులు అరెస్టు ఎపిసోడ్ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా.. కనీసం విచారించేందుకు పిలవకుండా సీనియర్ ఐపీఎస్ ను అరెస్టు చేయడానికి ప్రభుత్వం సాహసించిందంటే.. ఆయన విషయంలో చాలా సీరియస్ గా ఉందని అర్థం చేసుకోవాల్సివుంటుందని అంటున్నారు. ఎప్పుడో దాదాపు 8 నెలల క్రితం నమోదైన కేసులో ఆకస్మికంగా.. ఉరుములేని పిడుగులా పీఎస్సాఆర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన అరెస్టు సమాచారం ముందే తెలుసని, అందుకే ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేయలేదని సీనియర్ ఐపీఎస్ చెప్పడం కూడా మేకపోతు గాంభీర్యమేనంటున్నారు. వాస్తవానికి తన అరెస్టుపై ఎలాంటి సమాచారం లేకపోవడంతోనే ఆయన జైలుకు వెళ్లాల్సివచ్చిందని అంటున్నారు.
సీనియర్ ఐపీఎస్ పీఎస్సాఆర్ ఆంజనేయులు అరెస్టు రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సినీ నటి కాదంబరి జెత్వాని, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చేసిన ఫిర్యాదులతో రెండు కేసుల్లో పీఎస్సాఆర్ పేరును నిందితుడిగా చేర్చినా సరైన ఆధారాలు లేనిదే అరెస్టు చేసే అవకాశం లేదని టాక్ వినిపించింది. ప్రస్తుతం అరెస్టు చేసిన కాదంబరి కేసులో పీఎస్సాఆర్ ను ఎప్పుడో జైలుకు పంపేవారని, కానీ ఎందుకనో కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తన విషయంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తుండటాన్ని తేలిగ్గా తీసుకోవడమే కాకుండా పోస్టింగు లేకుండా ఖాళీగా ఉంచడంతో పీఎస్సాఆర్ తట్టుకోలేకపోయారంటున్నారు. దీంతో తన పూర్వ సంబంధాలను మళ్లీ యాక్టివ్ చేస్తూ ప్రభుత్వానికి చికాకు తెప్పించే పనులు ప్రారంభించారని అంటున్నారు. దీంతో కోరి కొరివితో తలగోక్కున్నట్లు అయిందని.. ఆయన ఆగఢాలు ఎంతమాత్రం సహించకూడదని నిర్ణయించిన ప్రభుత్వం తక్షణం అరెస్టుకు ఆదేశించిందని ప్రచారం జరుగుతోంది.
సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో పీఎస్సాఆర్ ను అరెస్టు చూపినప్పటికీ ఆయన అరెస్టు వెనుక ప్రధానంగా లిక్కర్ స్కామేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న పీఎస్సాఆర్ డిపార్టుమెంటులో తనకు ఉన్న పరిచయాలు ఉపయోగించి లిక్కర్ స్కాంలో లీకులు ఇస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని అంటున్నారు. అంతేకాకుండా ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తప్పించుకునేందుకు సాయపడటంతోపాటు కేసులో విచారణాధికారులు ఏ ప్రశ్న వేస్తే ఎలాంటి సమాధానం చెప్పాలనే విషయంపై ముందస్తుగా అలర్ట్ చేస్తున్నట్లు పీఎస్సాఆర్ పై ఆరోపణలు ప్రభుత్వానికి వెళ్లాయంటున్నారు.
గత ప్రభుత్వంలో ఐపీఎస్ గా కన్నా వైపీఎస్ గా పిలిపించుకోడానికి ప్రాధాన్యమిచ్చిన పీఎస్సాఆర్ ఇప్పుడూ అదే వైఖరి ప్రదర్శిస్తుండటంతో ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చిందని చెబుతున్నారు. సీనియర్ అధికారిగా గుర్తించి వదిలేద్దామని అనుకున్నా, పీఎస్సాఆర్ తన ప్రవర్తనతో ప్రభుత్వానికి గుచ్చిగుచ్చి సవాల్ విసిరినట్లు అయిందని అంటున్నారు. దీంతో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి అరెస్టు వరకు సమస్యను తెచ్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. తన అరెస్టుపై ముందుగా సమాచారం ఉన్నందునే ముందస్తు బెయిల్ కు ప్రయత్నించలేదన్న పీఎస్సాఆర్ వాదనలో పస లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కేసులో తొలి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ఎప్పుడో ముందస్తు బెయిల్ తీసుకున్నారని, కానీ తనను అరెస్టు చేసే ఆధారాలు లేవన్న ధీమాతోనే ఇన్నాళ్లు పీఎస్సాఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని టాక్ వినిపిస్తోంది. అయితే తన అంచనాలు తప్పుకోవడం, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. ఏదిఏమైనా ఓ సీనియర్ ఐపీఎస్ ను జైలుకు పంపడం ద్వారా కూటమి ప్రభుత్వం పెద్ద సాహసమే చేసిందని అంటున్నారు.