
శివ పురాణం ప్రకారం ఆంజనేయస్వామి శివుడి అవతారంగా చెబుతారు. ఇక రామాయణంలో హనుమంతుడికి విశిష్టమైన స్థానం ఉంది. శ్రీ రామ భక్తుడిగా.. సీతా రాముల దాసునిగా.. అత్యంత భక్తి శ్రద్ధలతో హిందువులతో పూజలను అందుకుంటున్నాడు. ఇక మన దేశంలో ఎక్కడ చూసిన హనుమంతుడి విగ్రహాలు కనిపిస్తాయి. అయితే, మన దాయది దేశమైన పాకిస్థాన్‌లో (Pakistan) అత్యంత పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. మరీ శ్రీ పంచముఖి హనుమాన్‌గా పూజలందుకుంటున్న ఈ ఆలయం విశేషాలేంటో తెలుసుకుందామా.
పాకిస్థాన్‌లోని కరాచీలో (Karachi) సోల్జర్ బజార్ వద్ద శ్రీరామభక్తుడు ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. నీలం, తెలుపు రంగులో 8 అడుగుల ఎత్తు ఉండే ఆలయంలోని విగ్రహం సహజ సిద్ధంగా ఏర్పడినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం హనుమ, నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, గరుడ ముఖాలతో దర్శనమిస్తుంది. వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్షణుడితో కలిసి ఇక్కడ విడిది చేసినట్టు స్థానిక స్థలపురాణం చెబుతోంది.
ఇక పురావస్తు శాఖ ప్రకశారం ఈ ఆలయం 1500 ఏళ్ల క్రితం నిర్మించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆలయ ప్రాంగణ తవ్వకాల్లో పురాతనమైన వానర మూకల విగ్రహాలతో పాటు కృష్ణుడు, వినాయకుడు వంటి అనేక విగ్రహాలు బయటపడ్డాయి. నలుపు, తెలుపు పాలరాయితో నిర్మితమైన ఈ ఆలయం ఆలయం ముందు వాకిలిలో ఇరువైపులా పసుపు రాయి స్తంభాలతో చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక పాక్‌లోని హిందువులు ప్రతి ఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో మూలవిరాట్ ఉన్న ప్రాంగణంలో 21 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరువెరుతాయని భక్తుల నమ్ముతారు. ఈ ఆలయంలో శ్రీరామనవమి కృష్ణాష్టమి హనుమజ్జయంతి ,దసరా ఉత్సవాలను వైభవం గా నిర్వహిస్తారు. మంగళ ,శనివారాలలో స్వామికి సిందూరం తోనూ నువ్వుల నూనె తోనూ పూజ చేస్తారు.