
ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ అరుదైన గౌరవం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పౌర పురస్కారం మూడవది అయిన పద్మభూషణ్ అవార్డుని ఆయన సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య తెలుగుదనంతో మెరిపించారు. తెలుగు జాతి నిలువెత్తు సంతకం అయిన పంచెకట్టుతో ఆయన కనిపించారు. తెలుగు వెలుగులను అలా ఢిల్లీలో వెలిగించారు.
కళ ఫిల్మ్ అభినయం విభాగంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇక బాలయ్య పేరుని ప్రకటించగానే ఆయన ఉత్సాహంగా నడుస్తూ అందరికీ అభివాదం చేసుకుంటూ వేదికను అధిరోహించారు. రాష్ట్రపతికి వినయంగా నమస్కరించి చిరునవ్వులు చిందిస్తూ ఆయన ఈ అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు.
బాలయ్య తెలుగు సినిమా రంగానికి గత యాభై ఏళ్ళకు పైగా విశేష సేవలను అందిస్తున్నారు. ఆయన అన్ని జానర్లలో నటిస్తూ మెప్పిస్తూ వస్తున్నారు. ఈ తరంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక జానపద జానర్లలో నటించిన ఏకైక నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ కి ఆయనే నాంది పలికారు. అది ఆదిత్య 369గా ఈ రోజుకీ జనం గుండెల్లో ఉండిపోయింది. అదే విధంగా ఫ్రాక్షన్ సినిమాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.
ఇక నందమూరి బాలయ్య ఈ అవార్డు అందుకోవడం పట్ల ఆయన అభిమానులు హర్షన్ వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావుకు పద్మశ్రీ అవార్డు 1960 దశకంలో లభించింది. ఇపుడు ఆయన కుమారుడికి దాదాపు ఆరు దశాబ్దాల తరువాత ఈ పౌర పురస్కారం దక్కింది. తెలుగు సినిమా రంగంలో నందమూరి కుటుంబం చేసిన సేవలు ఎంతో ఘనమైనవిగా చెప్పుకోవాలి. ఇక చూస్తే ఈ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కీలక నేతలు సహా ఎంతో మంది హాజరు అయ్యారు.
పద్మభూషణ్ అవార్డుని అందుకున్న బాలయ్యకు తెలుగు సినీ సీమ సత్కారం అందిస్తుందా అన్న చర్చ సాగుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు వచ్చినపుడు అంతా కలసి ఆయనను సన్మానించారు. మరి తెలుగు పరిశ్రమలో లెజండరీ పర్సనాలిటీగా ఉన్న బాలయ్యను కూడా సత్కరించుకోవడం సముచితం అన్న మాట ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.