దక్షిణ ఇరాన్‌లోని షాహిద్ రజాయే ఓడరేవులో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. దాదాపు 1,000 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ పరామర్శించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. అణ్వాయుధాలపై ఇరాన్, అమెరికా, ఒమన్‌లో మూడో విడత చర్చలు జరుపుతున్న వేళ, షాహిద్ రజాయే ఓడరేవులో ఈ నెల 26న భారీ పేలుడు సంభవించింది. దీని వెనుక విద్రోహ చర్య ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. బాలిస్టిక్ క్షేపణులలో ఘన రూప ఇంధనంగా వాడే అమ్మోనియం పెర్క్లోరేట్ రాకెట్ ఇంధనం గత నెలలో షాహిద్ రజాయే ఓడరేవులో దిగుమతి అయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అమ్మోనియం పెర్క్లోరేట్ కంటైనర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. 2020లో కూడా బీరుట్ ఓడరేవులో అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉన్న గోదాములో పేలుడు సంభవించి 200 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
