
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్రతో జనంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాల పర్యటనల కంటే పాదయాత్రతోనే మరోసారి అధికారంలోకి రావచ్చని జగన్ గట్టిగా విశ్వసిస్తున్నట్లుంది. 2027లో జగన్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం అవుతుందని కొన్ని మీడియాల్లో ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే జగన్ పాదయాత్రపై మాత్రం అధికారిక ప్రకటన వైసీపీ నుంచి రాలేదు. జగన్ కూడా ఎక్కడా పాదయాత్ర విషయాన్ని ప్రస్తావించలేదు. మరోసారి పాదయాత్ర చేస్తే పార్టీని బలోపేతం చేయడంతో పాటు విజయాన్ని కూడా అందుకోవచ్చని జగన్ గట్టిగా భావిస్తున్నారు. కానీ రెండోసారి పాదయాత్ర ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందన్న దానిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఎన్నికల్లోనూ…
2019 ఎన్నికలకు ముందు జరిపిన పాదయాత్ర వల్లనే తాను అధికారంలోకి వచ్చానని జగన్ భావిస్తున్నారు. అందులో నిజం కూడా లేకపోలేదు. మండుటెండలోనూ, వర్షాలలోనూ యాత్రను ఆపకుండా చేయడంతోనే ప్రజలు పార్టీకి కనెక్ట్ అయ్యారు. అందుకే 151 స్థానాలు వచ్చాయని వైసీపీ నేతలు కూడా పలు సందర్భాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలకు ముందు కూడా నారా లోకేశ్ జరిపిన యువగళం పాదయాత్రతోనూ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయన్న వాదన కూడా ఉంది. అంతకు ముందు 2014 ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించడానికి మీకోసం పాదయాత్ర అనేది కూడా అంతే నిజం. ఇలా పాదయాత్రలు విజయానికి దగ్గరగా బాటలు వేస్తుండటంతో దానిపైనే జగన్ దృష్టిపెట్టినట్లు అంటున్నారు.
కనెక్ట్ అవుతారని…
పాదయాత్ర ద్వారా అయితేనే తాను ప్రజల్లోకి సులువుగా వెళ్లగలనని, వారిని కలుసుకోవడంతో పాటు నేరుగా కనెక్ట్ అయి వారితో ఇంటరాక్ట్ అయితే వచ్చే ఫలితం వేరే లేవెల్ గా ఉంటుందని జగన్ భావిస్తున్నారు. కొత్త నాయకత్వాన్ని కూడా ఎంపిక చేసుకోవడానికి పాదయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలులో జాప్యంతో పాటు కొన్నింటిని అమలు చేయకపోవడం, ఇచ్చిన మాట తప్పిందని గ్రామస్థాయిలో తీసుకెళ్లడానికి పాదయాత్ర ఒక్కటే మార్గమని జగన్ నిర్ణయించుకున్నారని, దీనివల్ల తాను కోల్పోయిన ఇమేజ్ ను మరింత పెరిగే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు.
జమిలి ఎన్నికల నేపథ్యంలో…
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే జమిలి ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే 2027లో పాదయాత్ర మొదలు పెట్టి పది నెలల్లో ముగించేలా ప్లాన్ చేయాలని యోచిస్తున్నారు. 2028లో ఎన్నికలు జరిగే అవకాశముందని అంచనా వేసుకుని ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. ఈసారి ఇచ్ఛాపురం నుంచి కడప వరకూ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరో ఏడాదికి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని అప్పుడు పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుందని జగన్ తన ముఖ్య సన్నిహితుల వద్ద అన్నట్లు చెబుతున్నారు అందుకే జిల్లాల పర్యటన వాయిదావేస్తూ వస్తున్నారన్న వాదన కూడా ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే జగన్ అధికారికంగా ప్రకటించాల్సిందే.