
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. భానుడి ప్రతాపంతో పాటు వరుణుడి ప్రకోపం కూడా ఉంటుందని చెప్పింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని, మరికొన్న చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. మరికొన్ని చోట్ల వడగళ్ల వాన పడే అవకాశముందని కూడా వాతవరణ శాఖ పేర్కొంది.
రెండు రోజులు పాటు…
దీంతో పాటు రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భిన్నమైన వాతావరణం నెలకొంటుందని తెలిపింది. ఉదయం నుంచి ఎండ, సాయంత్రం వేళ వర్షాలు పడతాయని చెప్పింది. రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని కూడా చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ లోనూ…
ఆంధ్రప్రదేశ్ లో కూడా మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అయితే రానున్న మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా అయితే నమోదు కావని, తర్వాత మాత్రం రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కవగా నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్పింది.