
– హైదరాబాద్; పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా “ఆపరేషన్ సిందూర్” అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలు పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మరోసారి బయటపెట్టేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మదర్సా విద్యార్థుల వినియోగం నుంచి భారత యుద్ధ విమానాల కూల్చివేత వరకు ఆయన చేసిన ప్రకటనలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. పాకిస్థాన్ పార్లమెంటులో మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో అవసరమైతే మదర్సాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను కూడా వినియోగించుకుంటామని ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. “మదర్సాలు, అక్కడి విద్యార్థులు మాకు రెండో రక్షణ వలయం లాంటి వారు. సమయం వచ్చినప్పుడు, వారిని దేశ రక్షణ కోసం నూటికి నూరు శాతం వాడుకుంటాం” అని ఆయన పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అమాయకులైన విద్యార్థులను యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు బలిపశువులను చేస్తారా? అంటూ పలువురు నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. విద్యాసంస్థల పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడవద్దని హితవు పలుకుతున్నారు.