
వైభవ్ సూర్య వంశీ సీబీఎస్ఈ విధానంలో చదువుతున్నాడు. ప్రస్తుతం అతడు బీహార్ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల సీబీఎస్ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో వైభవ సూర్యవంశీ పదవ తరగతి ఫెయిల్ అయ్యాడని ఒక సంచలన వార్త సోషల్ మీడియాను ఊపేయడం మొదలైంది. వాస్తవానికి సూర్యవంశీ సీబీఎస్ఈ విధానంలో చదువుతున్నప్పటికీ.. అతడు పదవ తరగతి ఫెయిల్ కాలేదు. ఎందుకంటే అతడు ప్రస్తుతం చదువుతున్నది తొమ్మిదవ తరగతి మాత్రమే. ఇటీవల అతడు వార్షిక పరీక్షలు కూడా రాశాడు. అలాంటప్పుడు అతడు పదవ తరగతి పరీక్ష రాసే అవకాశం లేదు. ఫెయిల్ అవ్వడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. కానీ అనవసరంగా అతడి పేరును ఇందులోకి లాగడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది.. దీంతో వైభవ్ సూర్య వంశీ ఒక్కసారిగా తర్జన భర్జనకు గురయ్యాడు. చివరికి క్రికెట్ వర్గాలు రంగ ప్రవేశం చేసి ఈ వివాదానికి ముగింపు పలికాయి. ” సోషల్ మీడియా అంటేనే గాలి బ్యాచ్. అందులోనూ సెలబ్రిటీల విషయంలో అడ్డమైన చెత్త మొత్తం పోగవుతుంది. వైభవ్ సూర్య వంశీ విషయంలోనూ ఇదే జరిగింది. అతడికి 15 సంవత్సరాలు కూడా లేవు. అతను చదువుతోంది 9వ తరగతి మాత్రమే. ఇంతలోనే అతడు 10వ తరగతి ఎప్పుడు చదివాడు? ఎప్పుడు పరీక్షలు రాశాడు? ఎప్పుడు ఫెయిల్ అయ్యాడు? అతడు మామూలు విద్యార్థి కాదు కదా.. అతడు చదువులో చురుకు. పైగా అతడికి చదవంటే విపరీతమైన ఇష్టం. తన తండ్రి ఎంత కష్టపడుతున్నాడో అతడు దగ్గర నుంచి చూశాడు. అలాంటి వ్యక్తి చదువును ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు.. ఎందుకు పదవ తరగతిలో ఫెయిల్ అవుతాడు.. ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు.. రాసేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా.. ఎలాగూ సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టానుసారంగా రాసుకుంటూ పోతే ఎలా? నాలుగు వ్యాఖ్యలు రాయడం పెద్ద ఇబ్బంది కాదు. కానీ దానివల్ల ఒక మనిషి జీవితం ఎలా అవుతుందో కాస్త ఆలోచించాలని” క్రికెట్ వర్గాలు గాసిప్ రాయుళ్లకు హితవు పలుకుతున్నారు.