
TTD: వైసీపీ ప్రభుత్వంలో( YSR Congress government) ఒక వెలుగు వెలిగిన నాయకులు ఉన్నారు. అదే సమయంలో కొందరు ప్రముఖులు సైతం తమ ప్రభావాన్ని చూపారు. అటువంటి వారిలో విశాఖ శారదా పీఠం వ్యవస్థాపకులు స్వామి స్వరూపానంద కూడా ఒకరు. రాజ గురువుగా ఒక వెలుగు వెలిగారు ఆయన. తెలుగు రాష్ట్రాల్లోనే తన ప్రతాపాన్ని చూపారు. అటు కెసిఆర్, ఇటు జగన్మోహన్ రెడ్డికి రాజ గురువుగా వ్యవహరించారు. గత కొంతకాలంగా ఆయన చెప్పిందే వేదం.. చేసింది చట్టం అన్నట్టుగా ఉండేది. అయితే ఇరు రాష్ట్రాల్లో ఆ నాయకుని ఇద్దరు అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడు స్వరూపానందకు ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభం అయ్యాయి. విశాఖలో శారదా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు తిరుమలలో విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు మట్టం మొత్తాన్ని ఖాళీ చేసి అప్పగించాలని పేర్కొంది.
* ఐదేళ్ల పాటు ఎనలేని గౌరవం
తిరుమలలో వైసిపి పాలనలో శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద కు( Swami swarupananda) ఎనలేని గౌరవం దక్కేది. మంత్రులతో సమానంగా ప్రోటోకాల్ దక్కేది. ఏకంగా తిరుమలలో ఆశ్రమం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించింది టీటీడీ. మొత్తం టీటీడీలో స్వామివారి సూచనల మేరకు నిర్మాణాలు జరిగేవి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వామీజీ శాసించారు. దీనిపై అప్పట్లో ఎన్నో రకాల ఆరోపణలు వచ్చాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో సీన్ మారింది. విశాఖలో శారదాపీఠం నుంచి టీటీడీలో కార్యకలాపాల గురించి మొత్తం ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించాలని టిటిడి గతంలో నోటీసులు ఇచ్చింది. దీనిపై నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు తీర్పు మేరకు 15 రోజుల్లోపు మతాన్ని ఖాళీ చేసి అప్పగించాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
* ఆక్రమణలపై నోటీసులు.. తిరుమల( Tirumala) కొండపై 20 వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు టిటిడి చెబుతోంది. అవసరమైతే ఆ భవనాన్ని కూల్చివేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అదే భవనాన్ని ప్రత్యామ్నాయ అవసరాల కోసం వినియోగించాలని భావిస్తోంది. తొలుత ఈ అంశంపై మతం నిర్వహకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. అటువంటి భవనాల నిర్మాణాలకు కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది. దీంతో శారదా పీఠానికి షాక్ తగిలినట్లు అయింది.
* అప్పట్లో భూములు రద్దు..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖలో శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని రద్దు చేసింది. చంద్రబాబుతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని స్వామి స్వరూపానంద చెప్పుకొచ్చారు కూడా. అయితే గత ఐదేళ్లలో స్వామీజీ వ్యవహరించిన తీరుతో ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సైతం ఆయన తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ నేతల కేంద్రంగా కూడా విశాఖ శారదాపీఠం మారిపోయింది. అయితే రాష్ట్రంలో అధికార మార్పుతో పీఠం కళ చెదిరింది. ఇప్పుడు ఏకంగా శారదా పీఠానికి కేటాయించిన స్థలాలు రద్దు, ఇప్పుడు భవనాలను సైతం రద్దు చేయడం, వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది.