
తిరుమలలో భక్తుల రద్దీ కొంత పెరిగింది. గురువారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు రాక కూడా ప్రారంభమయింది. ఉత్తీర్ణులయిన వారు స్వామి వారి వద్ద మొక్కులు తీర్చుకునేందుకు తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలో రద్దీ పెరుగుతుంది. ఊహించినట్లుగానే వేసవి రద్దీ నేటి నుంచి ప్రారంభమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి నుంచి అమలు…
ఈరోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో సిఫార్సు లేఖలను స్వీకరించరు. జులై 15వ తేదీ వరకూ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ ముందుగానే ప్రకటించింది. సామాన్య భక్తులకు సులువుగా దర్శనం కల్పించేందుకు మాత్రమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది. వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి ముందుగానే ఈ చర్యలు ప్రారంభించింది. బ్రేక్ దర్శనాల కోసం నేటి నుంచి ప్రజాప్రతినిధులు ఎవరూ సిఫార్సు లేఖలు ఇవ్వవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇప్పటికే కోరారు.
ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో…
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,616 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,837 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.95 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.