
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు వచ్చి ఏడుకొండల వాడి వద్ద తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మరొకవైపు రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లలో ఉన్న వారికి మజ్జిగ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
బ్రేక్ దర్శనాల సమయంలో…
తిరుమలో శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పులు చేశారు. ఉదయం 6 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. బ్రేక్ దర్శనాలకు నిన్నటి నుంచి సిఫార్స్ లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వీకరించడం లేదు. ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం లభిస్తుంది. 2019కి ముందున్నట్లు గురు, శుక్రవారాలు మినహా మిగతా వారాల్లో ఉదయం 6 గంటలకు బ్రేక్ దర్శనాలు ఉండేవి. నేటి నుంచి జులై 15 వరకు ఈ నిర్ణయం అమలుకానుంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చే దిశగాఈ నిర్ణయం టీటీడీ తీసుకుంది. వేసది రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదు. జులై పదిహేనో తేదీ వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి…
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ప్రవేశించన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 57,863 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,030 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.04 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.