
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదనే చెప్పాలి. గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. సోమవారం నుంచి నేటి వరకూ భక్తులు స్వామి వారిని నేరుగా దర్శించుకునే అవకాశం భక్తులకు కలుగుతుంది. వేసవి కాలం కావడంతో పాటు, పరీక్ష ఫలితాలు విడులయిన నేపథ్యంలో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముందని భావించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
రద్దీ తక్కువగా ఉండటంతో…
అయితే భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగానే దర్శనం చేసుకుంటున్నారు. భక్తులు పెద్దగా వేచి ఉండకుండానే స్వామి వారిని దర్శించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాలు కూడా సులువుగా లభ్యమవుతున్నాయి. ఒక్కసారిగా భక్తులు రద్దీ తక్కువ కావడంతో తిరుమలలో లడ్డూ ప్రసాదాల కౌంటర్ వద్ద కూడా రష్ అంతగా లేదు. అన్నదాన సత్రం వద్ద కూడా సులువుగా వెళ్లి భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం…
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. స్వామి వారిని నేరుగా దర్శించుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,263 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,019 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.