
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరస సెలవులు కావడంతో పాటు పరీక్ష ఫలితాలు వచ్చేయడంతో వేసవిలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అయితే సిఫార్సు లేఖలు అనుమతించకపోతుండటంతో కొంత వరకూ భక్తులు సులువుగానే దర్శనం చేసుకుంటున్నప్పటికీ ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తుండటంతో దర్శన సమయం ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
నేడు స్థానిక కోటా కింద…
దీంతో పాటు నేడు స్థానిక కోటా కింద టోకెన్లు తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేయనుంది. తిరుపతి, తిరుమలలో ఉండేవారికి శ్రీవారి దర్శనం కోసం ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం చేసుకోవడానికి ఈ టోకెన్లు మంజూరు చేస్తారు. స్థానికులు ఆధార్ కార్డు చూపి టోకెన్లు పొంది మంగళవారం దర్శనం పొందవచ్చు. తిరుమల, తిరుపతిలో ఈ టోకెన్లు నేటి నుంచి జారీ చేస్తున్నారు. మరోవైపు తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు, దివ్యాంగులకు కూడా సత్వరం దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
31 కంపార్ట్ మెంట్లలో…
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్ లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,113 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,868 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.