
భారత్ – పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ జరిగింది. రేపు ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే ఉగ్రవాదులు ఊరుకుంటారా? అన్నది ఇప్పుడు అందరి మెదలో సందేహం నెలకొంది. పాకిస్తాన్ తమ స్వలాభం కోసం.. ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కడానికి, భారత్ దాడిని తట్టుకోలేక పాక్ వెనక్కు తగ్గి ఉండవచ్చు గాక. అయితే ఉగ్రవాదులు మాత్రం ఈ విషయంలో ఆగ్రహంగానే ఉండి ఉంటారు. తమ ప్రధాన స్థావరాలైన తొమ్మిదింటిపై దాడి చేయడంతో పాటు దాదాపు వంద మంది ఉగ్రవాదులను భారత్ మట్టు పెట్టిన నేపథ్యంలో టెర్రరిస్టుల ఆలోచన మారుతుందని ఎవరూ ఊహించరు. వారు మౌనంగా ఉంటారని భావించలేం.
ఏమరుపాటుగా ఉన్న సమయంలోనే…
ఉగ్రవాదులు ఎప్పుడూ నేరుగా యుద్ధానికి దిగరు. ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి అమాయకుల ప్రాణాలను తీస్తారు. పహాల్గాం ఘటన కూడా ఇలాంటిదే. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను బలి గొన్నారంటే వారి వ్యూహం.. అటాక్ ఎలా ఉంటుందో మనం చూశామని, అదే సమయంలో ఆపరేషన్ సింధూర్ తో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. వంద మంది ఉగ్రవాదులు వరకూ ఈ దాడిలో హతమయినట్లు వార్తలు వచ్చాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కూడా మరణించడంతో ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. అందుకే వారి ప్రస్తుత మౌనాన్ని మనం తగ్గినట్లుగా చూడకూడదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.
రేపటి చర్చల్లోనూ…
అదను చూసి విరుచుకుపడటం వారి నైజం. అందుకే భారత సైన్యం కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినా ఇంకా సుదీర్ఘకాలం అప్రమత్తంగా ఉండాల్సిందే. భారత్ లోకి చొరబాట్లు లేకుండా చూడాల్సి ఉంది. రేపు ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ ల మధ్య చర్చల్లోనూ ఉగ్రవాదం నిర్మూలనపై భారత్ ప్రధానంగా చర్చించాల్సి ఉంది. పాక్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిలించేందుకు ఈ చర్చల్లో ప్రధానంగా భారత్ ప్రయత్నించగలగాలి అంటున్నారు. కాల్పుల విరమణ, ఇరు దేశాల మధ్య సింధూ జలాల వంటి విషయాలను మాత్రమే కాకుండా ఉగ్రవాదులను అంతం చేయడంపై కూడా ముఖ్యంగా చర్చించాలన్న డిమాండ్ బాగా వినపడుతుంది. లేకుంటే మరో ఉన్మాదానికి ఉగ్రవాదులు పాల్పడరన్న గ్యారంటీ లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.