
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభుత్వ పెద్దల అనుమానాలను నిజం చేస్తూ కీలక ఆధారం లభించిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన మరునాడు రాత్రి ఫోన్ ట్యాపింగుకు సంబంధించిన ఆధారాలు అన్నీ ధ్వంసం చేసిన టెలికాం సంస్థల నుంచి వచ్చిన ఓ ఈ-మెయిల్ మొత్తం గుట్టు రట్టు చేసిందని అంటున్నారు. వాస్తవానికి ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనేది అర్థం కాక ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తొలుత తలలు పట్టుకున్నారని, ఆ సమయంలోనే వచ్చిన ఈ మెయిల్ వారికి దారి చూపిందని అంటున్నారు.
మొత్తం 615 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉండగా, సిట్ అధికారులు ఒక్కొక్కరిని పిలిచి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తదితరుల నుంచి సిట్ స్టేట్మెంట్లు రికార్డు చేసింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోగుట్టు ఎలా తెలిసిందో కూడా సిట్ అధికారులు వారికి చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ పై ఒక్క ఆధారం లభించకుండా నిందితులు జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు. హార్డ్ డిస్కలను తీసివేయడం, వాటిని ముక్కలు చేసి మూసీ నదిలో పడేయడంతో తమను ఎవరూ పట్టుకోలేరని నిందితులు భావించారని సిట్ అధికారులు చెబుతున్నారు.
అయితే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అనుమతి పొందిన వెంటనే ఎస్ఐబీ టెలికాం సంస్థల నుంచి ఆయా ఫోన్ నెంబర్ల సమాచారం తెప్పించుకునేవని చెబుతున్నారు. ఎస్ఐబీ అడిగిన వెంటనే టెలికాం సంస్థలు ఈ సమాచారాన్ని చేరవేసేవని, ఈ క్రమంలో 2023 నవంబరులో 615 ఫోన్ నెంబర్లపై సమాచారం కావాలని ఎస్ఐబీ టెలికాం సర్వీసు ప్రొవైడర్ (టీఎస్పీ)కి అడిగినట్లు చెబుతున్నారు. దీనికి సమాధానంగా టీఎస్పీ డిసెంబరులో కొన్ని నంబర్ల సమాచారం మెయిల్ చేసిందని చెబుతున్నారు. ఆ ఈ మెయిల్ ఇప్పుడు కేసు విచారణలో కీలకంగా మారిందని అంటున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో పంజాగుట్ట పోలీసు స్టేషనులో కేసు నమోదు చేసిన అధికారులకు తొలుత ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. అలాంటి సమయంలో టీఎస్పీ నుంచి ఫోన్ నెంబర్లతో కూడిన మెయిల్ రావడంతో లీడ్ దొరికిందని అంటున్నారు. మొత్తం 15 రోజుల సమాచారం టీఎస్పీల నుంచి ఎస్ఐబీకి వచ్చిందని, అందులో 615 మంది నెంబర్లు ఉండగా, వారంతా ప్రముఖులే అన్న విషయం గుర్తించినట్లు చెబుతున్నారు. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే కారణంగా 615 నంబర్లనుు ట్యాప్ చేయడానికి అనుమతి తీసుకున్నారని, కానీ, ఆ 615 మందిలో ఏ ఒక్కరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లేవని అంటున్నారు. దీంతో దీనిపై నివేదిక తయారు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని సిట్ భావిస్తోంది. కేసు విచారణలో కీలకమైన అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకరరావు ముందస్తు బెయిలును రద్దు చేయించి అదుపులోకి తీసుకోవాలని భావిస్తోందని అంటున్నారు.