
ఇండియా – పాక్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. హాట్ లైన్ మధ్య ఇరుదేశాలకు చెందిన సైనికాధికారులు అనేక అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే రెండు దేశాలు అత్యున్నత సమావేశాలు నిర్వహించి నేటి సమావేశంలో చర్చించనున్న కీలక అంశాలపై ఒక అవగాహనకు వచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. త్రివిధ దళాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు మోదీ అధికారులతో చర్చించారు. చర్చల్లో ఏ యే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఉగ్రవాదులను బేషరతుగా…
పాక్ లో తలదాచుకున్న ఉగ్రవాదులను బేషరతుగా భారత్ కు అప్పగించాలన్నది ప్రధాన డిమాండ్ గా ఉంది. ఉగ్రవాదుల నిర్మూలన పైనే భారత్ ఎక్కువగా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఉగ్రవాదులు తరచూ అక్రమంగా చొరబడి భారత్ లో దాడులకు పాల్పడుతుండటం, అమాయకులైన ప్రాణాలను తీయడాన్ని ఇక సహించేది లేదని, అందుకే కాల్పుల విరమణ కొనసాగాలంటే ఖచ్చితంగా ఉగ్రవాదులను తమకు అప్పగించాలన్న షరతును భారత్ పాక్ ముందు ఉంచనుంది. అయితే పాక్ ఎంత వరకూ దీనిపై స్పందిస్తుందన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఉగ్రవాదులు, ఐసిస్, సైన్యం కలగలపి పాక్ లో రాజ్యమేలుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో పాక్ ఈ ప్రతిపాదనకు ఏ మేరకు అంగీకరిస్తుందన్నది మాత్రం అనుమానమే.
కవ్వింపు చర్యలకు దిగితే…
అందుకే ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఉగ్రవాదులను ఏరివేసేంత వరకూ ఈ ఆపరేషన్ కొనసాగుతుందని, పౌరులు తమ లక్ష్యం కాదని, ఉగ్రవాదులే తమ టార్గెట్ అని భారత్ ఈ చర్చల్లో స్పష్టం చేయనున్నట్లు సమాచారం. అలాగే పాక్ కవ్వింపు చర్యలకు దిగితే భారత్ చూస్తూ ఊరుకోదని, తాము కూడా ప్రతి దాడులకు దిగాల్సి వస్తుందన్న వార్నింగ్ ఈ సమావేశం ద్వారా దాయాది దేశానికి ఇవ్వనున్నట్లు తెలిసింది. అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, తీవ్రవాదులను ఏరివేసేందుకు పాక్ సహకరిస్తామని అంతర్జాతీయ సమాజం ముందు అంగీకరించి అందుకు అనుగుణంగా స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుందన్న షరతును కూడా భారత్ ఈ చర్చల సందర్భంగా పెట్టనున్నట్లు తెలిసింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై…
మరో వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వదిలేయాలన్నది భారత్ మరో డిమాండ్ గా వినిపిస్తుంది. ఇది కూడా క్లిష్టమైన సమస్య. నిన్న త్రివిధ దళాల అధిపతుల సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ పీవోకే విషయాన్ని ప్రస్తావించారంటే ఈ విషయంపై కూడా పాక్ తో జరిగే చర్చల్లో ప్రధానంగా ఉండే అవకాశముంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగించడం మినహా మరో మార్గం లేదన్నవిషయాన్ని చర్చల్లో స్పష్టం చేయదలచుకుంది. కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా చెప్పదలచుకుంది. అదే సమయంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే భారత్ కూడా ప్రతిదాడులు చేయడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ చర్చల్లో స్పష్టం చేయదలచుకుంది.