
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ నేటికీ కొనసాగుతుంది. నేటికి రెండు నెలలు చేరుకుంది. ఈరోజుకు అరవై రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ ఆరుగురి కార్మికుల మృతదేహాల ఆచూకీ మాత్రం లభించడం లేదు. ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించలేదు. కేవలం టన్నెల్ లో పేరుకుపోయిన బురద, బండరాళ్లు, టీబీఎం మిషన్ శకలాలను మాత్రమే తొలగిస్తున్నారు. లోకో ట్రెయిన్ ద్వారా టీబీఎం మిషన్ శకలాలను, బురద, బండరాళ్లను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తీసుకువస్తున్నారు.
ఇంకా అసలు చోటికి…
టీబీఎం యంత్రాన్ని కట్ చేసి బయటకు తరలించాలంటే కష్టంగా మారింది. దాదాపు పన్నెండు బృందాలకు చెందిన 650 మంది సభ్యులు మూడు షిఫ్ట్ లలో నిరంతరం పనిచేస్తున్నా రెండు నెలల నుంచి ఆపరేషన్ కొలిక్కి రాలేదు. పైకప్పు విరిగిపడకుండా ముందుగా చర్యలు తీసుకుంటూ వీటిని తొలగిస్తుండటంతో ఈ ప్రక్రియ కూడా ఆలస్యంగా మారిందని చెబుతున్నారు. టన్నెల్ లో ఉబికి వస్తున్న నీటిని బయటకు తీసుకు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. నీటి మోటార్లను పెట్టి బయటకు వదులుతున్నారు. దాదాపు తొమ్మిది అడుగుల మేరకు పేరుకుపోయిన బురదను తొలగించడం వారికి కష్టంగా మారింది.
కంచెను ఏర్పాటు చేసి…
ప్రమాదకరమైన ప్రాంతానికి ఇంకా సహాయక బృందాలు వెళ్లలేదు. అయితే దాని చుట్టూ కంచెను ఏర్పాటు చేసి దాని వరకే రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. ఎల్లుండి టన్నెల్ లో ప్రమాదకరమైన ప్రాంతంలో తవ్వకాలపై పూర్తి స్థాయి సమీక్షను ఉన్నతాధికారులు నిర్వహించనున్నారు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి శివశంకర్ నిపుణులతోనూ, ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుని సహాయక బృందాలకు మార్గదర్శనం ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో తవ్వకాలు జరిపితే తప్ప మృతదేహాలు లేక అవశేషాలు అయినా లభ్యమయ్యే ఛాన్స్ లేదు. అది మరో మూడు రోజులు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.