
శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కు బ్రేక్ పడింది. తాత్కాలికంగా విరామం అని చెబుతున్నా మూడు నెలల వరకూ ప్రమాదం జరిగిన ప్రాంతంలో తవ్వకాలు జరిపే అవకాశం లేదని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు కనీసం మృతదేహాలను కూడా అప్పగించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే 68 రోజులు దాటిపోయింది. మరో మూడు నెలలు అంటే.. మొత్తం ఐదు నెలల పాటు మృతదేహాలు ఎలా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. కేవలం అవశేషాలు మాత్రమే లభ్యమవుతాయి. దీంతో మృతుల కుటుంబాలు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తమ వారిని పనికి తీసుకెళ్లి కనీసం మృతదేహాలను అప్పగించడం లేదన్న ఆందోళన వారిలో నెలకొంది.
మరోసారి కూలే అవకాశముందని…
అయితే ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు ఎలా చేయాలంటే అక్కడ మరోసారి ప్రమాదం జరిగే అవకాశముందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. మరోసారి పై కప్పు కూలే అవకాశముందని, ప్రమాదకరమైన జోన్ లో తవ్వకాలు జరపడం మంచిది కాదని, సేఫ్ కూడా కాదని, కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించింది. దీంతో దీనిపై సమీక్షించిన అధికారులు మూడు నెలల పాటు శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో మృతదేహాల వెలికి తీత పనులను నిలిపివేయాలని నిర్ణయించారు. అంటే.. ఇక మృతదేహాలను వారి కుటంబాలకు అప్పగించే అవకాశమూ లేదని చెప్పాలి. నిజంగా ఇది విషాదమే.
రెండు నెలలు దాటడంతో…
ప్రమాదం జరిగి రెండు నెలలు దాటి పోవడంతో కార్మికుల కుటుంబాలు కూడా మానసికంగా సిద్ధమయ్యారు. తమ వారు ప్రాణాలతో లేరని, కనీసం మృతదేహాలను అయినా తమకు అప్పగిస్తే చివరి చూపు చూసుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించుకుంటామని అంటున్నారు. కానీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ ఆశకూడా లేకుండా పోయింది. క్రిటికల్ జోన్ లో తవ్వకాలను జరిపితే ప్రమాదకరమన్న హెచ్చరికలతో నిలిపేశామని అంటున్నప్పటికీ వారి బంధువులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదం ఎనిమిది కుటుంబాల్లో విషాదం నింపడమే కాకుండా ఆఖరి చూపు కూడా దక్కదేమోనన్న ఆవేదన వ్యక్తమవుతుంది.