
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం లో జరిగిన ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గోడ కూలడంతోనే ఎనిమిది మంది మరణించారు. విశాఖ జిల్లాలో జరిగిన ఈ ఘటన నిజంగా సంచలనంగా మారింది. వర్షం పడితే గోడ కూలడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. గోడ ఇరవై రోజుల క్రితమే నిర్మించినట్లు తెలిసింది. నాసిరకం నిర్మాణం చేపట్టారా? అన్న అనుమానం కలుగుతుంది. గోడ నాణ్యతను కనీసం దేవాదయ శాఖ ఇంజినీర్లు పరిశీలించలేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈదురుగాలులు.. వర్షం పడినంత మాత్రాన గోడ కూలిపోతే ఇక గోడ నిర్మాణం ఏ మాత్రం కట్టారన్నది అర్థమవుతుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గోడ నిర్మాణంపై…
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులు అప్పన్న స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఈ గోడ నిర్మాణం జరిగింది. అయితే నిర్మాణంలోనే నాసిరకం సామగ్రి వాడినట్లు స్పష్టమవుతుందని తెలిపింది. కాంట్రాక్టర్లు గోడ నిర్మాణం ఎలా చేపడుతున్నారన్న దానిపై కూడా ఇంజినీరింగ్ అధికారులు కానీ, దేవాదాయ శాఖ అధికారుల కానీ పర్యవేక్షణ లేదని అనిపిస్తుంది. డబ్బులు అయితే కాంట్రాక్టర్ కు చెల్లించారు తప్పించి ఆ గోడ నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ముందుగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. గోడ నిర్మాణం జరిగిన తీరుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
లక్షల సంఖ్యలో వస్తారని తెలిసి…
విశాఖ జిల్లాలోని చందనోత్సవం అంటే లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం ఎక్కడెక్కడినుంచో వస్తారని తెలుసు. కొన్ని రోజుల ముందు నుంచే ఆలయ అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్ లైన్ టిక్కెట్లను కూడా విక్రయించారు. భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరుకున్నారే కానీ వారికి ఏ మాత్రం ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకోకపోవడం ఖచ్చితంగా ఆలయ అధికారుల తప్పిదంగానే చూడాలి. గోడకు తాడు వేసినంత మాత్రాన టెంటు ఈదురుగాలికి పడిపోవడంతోనే గోడ పడిపోయిందంటున్నారు. ఇంతోటి దానికి గోడ నిర్మాణం చేపట్టడం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుంది. గోడ కూలిన ఘటనకు బాధ్యులుగా అధికారులను చేయాలని పలువురు కోరుతున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన…
సింహాచలం ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు చెబుతున్నారు. దర్శనానికి వచ్చి ప్రాణాలు కోల్పోయారంటూ కేజీహెచ్ వద్ద మృతుల బంధువులు రోదిస్తున్నారు. ఈ ఘటనలో భార్యాభర్తలు పిళ్లా ఉమామహేశ్వరరావు, పిళ్లా శైలజ మృతి చెందారు. ఇదే ప్రమాదంలో శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త కూడా మృతి చెందారని, ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతదేహాలకు పోస్టు మార్టం చేసి వీలయినంత త్వరగా బంధువులకు అప్పగించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. పోస్టు మార్టం ఆలస్యం కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.