
సింహాచలం ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత అధికారులదేనని చెప్పాలి. నిన్న జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. సింహాద్రి అప్పన్నస్వామి దర్శానికి వచ్చి నిజరూపదర్శనం చేసుకుందామని భక్తితో వచ్చిన వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురితో ఒక కటమిటీని నియమించింది. అయితే సింహాచలం చందనోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందరికీ తెలుసు. దాదాపు లక్షనర్న మంది భక్తులు ఒక్కసారిగా తరలి వస్తారని, వారికి దర్శనం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి అధికారులు ముందుగా ఏర్పాట్లు చేయాల్సి ఉండగా అది మాత్రం మరిచిపోయి మిగిలిన పనుల్లో నిమగ్నమయ్యారు.
తూతూ మంత్రంగా…
చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని తెలిసి కూడా అధికారులు ఏర్పాట్లను తూతూ మంత్రంగా చేశారు. కేవలం ఆరు రోజుల ముందు డెబ్భయి పొడవులు, పది అడుగుల ఎత్తు ఉన్న గోడను హడావిడిగా నిర్మించారు. గోడ నిర్మాణం చేపట్టకపోయినా ఈ దుర్ఘటన జరిగి ఉండేదికాదన్న అభిప్రాయం ఎక్కువమందిలో వ్యక్తమవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కోసం ఈ గోడను నిర్మించామని చెబుతున్నా, దానికి కనీసం రోప్ లతో ప్రత్యేకంగా లేకుంటే ఇనుప కంచెలతో క్యూ లైన్ నిర్మించి ఉంటే సరిపోయేది. అలా కాకుండా పది అడుగుల ఎత్తు గోడను హడావిడిగా నిర్మించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
భక్తుల వస్తారని తెలిసి ఈవో…
దీంతోపాటు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి ఈవో సెలవుపై వెళ్లిపోవడం కూడా ఆశ్చర్యంగా ఉంది. అవగాహన లేని అధకారిని ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించారని తెలిసింది. దీంతో అవగాహన లేకుండా గోడను నిర్మించడమే కాకుండా హడావిడిగా చేసిన పనులకు తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి, ఈదురుగాలులకు ప్రాణాలు పోయాయి. దీంతో కేవలం అధికారుల తప్పిదమే ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. సరిగా గైడ్ చేసే వారు లేకపోవడంతోనే సింహాచలంలో ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు. దేవాదాయ శాఖలో ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించి ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అసలు ఇంత పెద్ద ఉత్సవం జరుగుతుండగా ఈవో సెలవు పై ఎలా వెళతారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ ఉన్నతాధికారులదే.