
విశాఖపట్నం జిల్లా సింహాచలంలో బుధవారం తెల్లవారు జామున ఓ గోడ కూలి భక్తులపై పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందిన ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ప్రధానంగా జిల్లా అధికారులపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినా.. ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అధికారులపై చంద్రబాబు ఇప్పటకే మండివపడ్డారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సింహాచలంలో ఏర్పాట్లకు సంబంధించి ఎన్ని సార్లు సమీక్షించారని ఆయనను చంద్రబాబు ప్రశ్నించారు.
అధికారులదే బాధ్యత…
ఇందుకు కలెక్టర్ తాను ఒకే ఒక్కసారి సమీక్షించానని.. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తాను సింహాచలంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయానని వివరించారు. అందుకు ముఖ్యమంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అదేసమయంలో జిల్లాకు చెందిన హోం మంత్రి అనితపైనా అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాటు చేసే ముందు మీరు పర్యవేక్షించారా? అని ఆమెను కూడా నిలదీసినట్లు తెలిసింది. సింహాచలం ఘటనపై తనకు 72 గంటల్లోగా నివేదికను అందించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు డెడ్లైన్ విధించారు. నివేదిక వచ్చిన తర్వాత ఉన్నతాధికారులపై చర్యలు తప్పవంటున్నారు.