

Sanchar Saathi: మీ ఫోన్ పోయిందా? సంచార్ సారథి ప్లాట్‌ఫాం ద్వారా తిరిగి ఎలా పొందాలో తెలుసుకోండి! ఇప్పటికే 20 లక్షల ఫోన్లు ట్రేస్
Sanchar Saathi: మీ ఫోన్ కోల్పోయారా లేదా దొంగిలించబడిందా? అయితే ప్రభుత్వం అందించిన సంచార్ సారథి (Sanchar Saathi) డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీకు తిరిగి దానిని పొందడంలో సహాయపడుతుంది. ఇప్పటి వరకు ఈ పోర్టల్ 20.28 లక్షల మొబైల్ ఫోన్లను గుర్తించగా, 33.5 లక్షల హ్యాండ్సెట్లు బ్లాక్ చేయబడ్డాయి. టెలికాం శాఖ మంత్రి చంద్ర శేఖర్ పెమ్మసాని తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్లాట్‌ఫామ్ మోసపూరిత మొబైల్ కనెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
కోల్పోయిన ఫోన్లలో ఎంత పర్సెంటేజ్ రికవరీ అయ్యిందంటే?
రాష్ట్రాల వారీగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో, సగటున 22.9 శాతం రికవరీ రేటు నమోదైందని వెల్లడించారు. ఇప్పటి వరకు 4.64 లక్షల హ్యాండ్సెట్లు వాటి యజమానులకు తిరిగి అందించబడ్డాయి.
సంచార్ సారథి ద్వారా మీరు చేయగలిగేది ఏమిటి?
ఈ పోర్టల్ ద్వారా మీరు:
దొంగిలించబడిన లేదా కోల్పోయిన మొబైల్ ఫోన్లను రిపోర్ట్ చేయవచ్చు
అవి భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌లోనూ వాడకుండా బ్లాక్ చేయవచ్చు
మోసపూరిత కాల్స్, సందేశాలు, నకిలీ మొబైల్ కనెక్షన్లను నివేదించవచ్చు
చక్షు పోర్టల్ ద్వారా అనుమానాస్పద ఇంటర్నేషనల్ కాల్స్‌ను కూడా ఫిర్యాదు చేయవచ్చు
మీ పేరుతో జారీ అయిన మొబైల్ నంబర్లను తనిఖీ చేసి, అనధికార కనెక్షన్లను రద్దు చేయవచ్చు
ఫోన్ రిపోర్ట్ చేయాలంటే ఏమేమి అవసరం?
మీ ఫోన్‌ను బ్లాక్ చేయాలంటే IMEI నంబర్ తప్పనిసరి. ఇది మీరు ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో బిల్లుపై లేదా ప్యాకేజింగ్ బాక్స్‌పై ఉంటుంది.
మీ దగ్గర IMEI నంబర్, ఫోన్ నంబర్, పోలీస్ ఫిర్యాదు కాపీ, ఫోన్ కోల్పోయిన తేదీ, స్థలం, జిల్లా వంటి వివరాలు సిద్ధంగా ఉంచుకోండి.
పోర్టల్‌లో “Block Stolen/Lost Phone” అనే ఆప్షన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయండి. 24 గంటల్లో మీ ఫోన్‌ను బ్లాక్ చేస్తారు. ఫోన్ తిరిగి దొరికిన తర్వాత అదే పోర్టల్ ద్వారా అన్‌బ్లాక్ చేసుకోవచ్చు.
ఎలా యాక్సెస్ చేయాలి?
సంచార్ సారథి వెబ్సైట్: https://sancharsaathi.gov.in
అక్కడ “Citizen Centric Services” విభాగంలోకి వెళ్లి మీకు అవసరమైన సేవను ఎంచుకోండి. యాప్ వర్షన్ కూడా అందుబాటులో ఉంది.
తుది మాట:
సంచార్ సారథి డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా మీరు మీ డిజిటల్ భద్రతను బలోపేతం చేసుకోవచ్చు. మొబైల్ మోసాలను నివారించి, మీ వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనం.