
స్పేస్ ఎక్స్ సీఈఓ, డోజ్ అధినేత ఎలాన్ మస్క్ గురించిన ఓ ఆసక్తికరవిషయం తెరపైకి వచ్చింది. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) మాజీ ఏజెంట్ జొనాథన్ బమా.. ఓ షాకింగ్ విషయం చెప్పారు. ఇందులో భాగంగా.. రష్యాన్ నిఘా సంస్థలు సెక్స్, డ్రగ్స్ ద్వారా ఎలాన్ మస్క్ ను బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నించాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును… ఎలాన్ మస్క్ ను ట్రాప్ చేయడానికి, అతన్ని తమ ఉచ్చులో పాడేయడానికి రష్యా కుట్ర పన్నిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ తనకు చెప్పారని జొనాథన్ బమా తెలిపారు. అయితే.. ఆ ఎఫ్.బీ.ఐ. ఏజెంట్ వివరాలు మాత్రం వెళ్లడించలేదు. ఇదే సమయంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ప్లాన్ కు ఆమోదం తెలిపారని బుమా తెలిపారు.
జర్మన్ బ్రాడ్ కాస్టర్ జెడ్.డీ.ఎఫ్. ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సందర్భంగా బుమా ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎలాన్ మస్క్ తో పాటు పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ కూడా రష్యన్ గూఢచారుల నిఘాలో ఉన్నారని బుమా తెలిపారు. వీరిని బ్లాక్ మెయిల్ చేయడానికి రష్యా రహస్య సమాచారం సేకరించిందని అన్నారు.
దీనికోసం.. ఎలాన్ మస్క్ వ్యక్తిగత ఇంట్రస్టులు, అలవాట్లను సద్వినియోగం చేసుకునేందుకు రష్యన్ నిఘా సంస్థలు ప్రయత్నించాయని.. సెక్స్, డ్రగ్స్, ముఖ్యంగా కెటామైన్ పై మస్క్ ఆసక్తిని కలిగి ఉన్నారని భావించారని.. ఈ మేరకు మస్క్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్లాన్ వేశారని.. ఇలా మస్క్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి రహస్య సమాచార సేకరణకు ప్లాన్ చేశారని పేర్కొన్నారు.
కాగా… జొనాథన్ బుమా సుమారు 16 సంవత్సరాలుగా ఎఫ్.బీ.ఐ. లో పనిచేస్తున్నారు. అయితే.. రహస్య సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై అతన్ని ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణల అనంతరం బుమా.. 1,00,000 డాలర్లు చెల్లించి బెయిల్ పై విడుదలయ్యారు. ఏది ఏమైనా ఈ మస్క్ – రష్యాపై బుమా చేసిన ఆరోపణలు రుజువైతే మాత్రం అది అత్యంత హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది!