
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కాలంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సిఫార్సు లేఖలను తొలుత తిరస్కరించినా తిరిగి తీసుకుంటుండటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని, అంతేకాకుండా వాతావరణం చల్లబడటంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.
నేటి నుంచి సేవా టిక్కెట్ల విడుదల…
ఆగస్టు నెలకు సంబంధించిన ఆన్ లైన్ ఆర్జిత,ఇతర టికెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవాలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా విడుదల చేస్తుంది. మే 21వ తేదీన ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపింది. మే22 తేదీన ఉదయం 10 గంటలకు మరిన్ని ఆర్జిత సేవాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మే 22 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల చేయనుంది.మే23 తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లను, మే 23 తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదల చేయనుంది. మే 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు,దివ్యాంగుల టోకెన్లు విడుదల చేయనుంది. మే 24వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మే 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు విడుదలకు సంబందించి, మే 29 తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా కోటా విడుదల చేయనుంది.
31 కంపార్ట్ మెంట్లలో…
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,372 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.