
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) సినిమాలో కనీసం 5 నిమిషాలు కనిపించినా చాలు అని ఇండియా లో ప్రతీ సూపర్ స్టార్ కోరుకుంటారు. ఆయన సంపాదించిన కీర్తి అలాంటిది. ప్రపంచం మొత్తం కీర్తించే షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కూడా రజినీకాంత్ ని పొగుడుతూ ఒక స్పెషల్ సాంగ్ చేశాడంటే ఆయన స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సూపర్ స్టార్ తో ఐశ్వర్య రాయ్ ‘రోబో’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా ఆరోజుల్లో ఎలాంటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. ఇందులో రజినీకాంత్, ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan) జోడీ కూడా బాగా కుదిరింది. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందు రజినీకాంత్ కొన్ని అవమానాలను ఎదురుకున్నాడట. దాని గురించి ఆయన గతంలో ఫన్నీ గా రోబో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివరించాడు.
ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఈ వీడియో ని అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈ వీడియో లో రజినీకాంత్ ఏమన్నాడంటే ‘ థాంక్యూ ఐశ్వర్య..నా పక్కన హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నావు. నేను షూటింగ్ కి కాస్త గ్యాప్ రావడంతో మా బంధువుల ఇంటికి వెళ్లాను. అక్కడికి ఆ ఇంటికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఒకరోజు వచ్చాడు. అతనికి ఒక 60 ఏళ్ళు ఉంటాయి. నన్ను చూడగానే ఏమి రజిని ఎలా ఉన్నావు?, సినిమాలు ఇంకా చేస్తున్నావా? , రిటైర్ అయిపోయావా?, నెత్తి మీద వెంట్రుకలన్నీ రాలిపోయాయి ఏమిటి అని అడిగాడు. నేను ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాను అని చెప్పాను. అవునా, చాలా మంచిది, ఏ సినిమా చేస్తున్నావ్ అని అడిగితే రోబో అని చెప్పాను. హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అని కూడా చెప్పాను’.
‘అవునా..మరి హీరో ఎవరు అని అడిగాడు. నేనే అని చెప్తే అతను షాక్ కి గురయ్యాడు. ఒక పది నిమిషాల పాటు అతను ఏమి మాట్లాడకుండా నా వైపే చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత బయటకి వెళ్లిన తర్వాత అతని అరుపులు వినిపించాయి. ఇతని పక్కన హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఏమిటి?, అభిషేక్ బచ్చన్ కి ఏమైంది?, ఎలా చేయనిస్తున్నాడు ఈ సినిమా?, కనీసం అమితాబ్ బచ్చన్ అయినా ఆపాలి కదా అని గట్టిగా అరిచాడు’ అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్. ఆయన మాట్లాడిన ఈ మాటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ప్రతీ ఒక్కరు పగలబడి నవ్వుకున్నారు. అంత పెద్ద లెజెండ్ స్థానంలో కూర్చొని కూడా తన మీద తానూ ఇలాంటి జోక్స్ వేసుకోవడాన్ని చూస్తుంటే రజినీకాంత్ ఎంత గ్రౌండేడ్ మనిషి అనేది అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేసారు.