
ప్రమాదం అనేది తెలియకుండానే జరుగుతుంది. కానీ ప్రమాదంలోనూ రాజకీయాన్ని వెతుక్కునే వారు నేతలు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రమాదాలను ఎవరూ ఆపలేరు. పాలకులు ఎన్ని సమీక్షలు నిర్వహించినా, ఎన్ని చర్యలు చేపట్టినా అనుకోకుండా జరిగే ప్రమాదాలను ఆపడం ఎవరి తరమూ కాదు. కానీ మన రాజకీయ నేతలున్నారే.. వారికి పొలిటికల్ ఫుడ్డు కావాలి. ప్రమాదాన్ని ప్రమాదంలా చూడరు. అందులోనూ అధికార పార్టీ తప్పులను వెదికే ప్రయత్నాలు చేస్తుంటారు. వారి హయాంలో జరిగిన ప్రమాదాల సంగతిని మాత్రం గుర్తుకు రావు. ప్రమాద స్థలిని సందర్శించి ప్రభుత్వ వైఫల్యం అంటూ గొంతెత్తి అరవడం రాజకీయ నేతలకు ఒక ఫ్యాషన్ గా మారింది.
బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలో…
ప్రమాదం జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు బాధితులకు అండగా నిలవాలి. అవసరమైతే వారి పార్టీ నుంచి సాయాన్ని అందించాలి. అంతే తప్పించి ప్రమాద ఘటనను ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం జరిగి దాదాపు పదిహేడు మంది నాలుగు కుటుంబాలకు చెందిన వారు మరణించారు. ఉమ్మడి కుటుంబం. వీరు వ్యాపారులుగా వచ్చి ఇక్కడ స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. ప్రమాదం జరిగి బాధితులు ఒకవైపు రోదిస్తుంటే అది ప్రభుత్వ వైఫల్యమేనని అంటూ రాజకీయ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కావాలని ఆ ప్రమాదం చేసినట్లే మాట్లాడటం విచిత్రంగా ఉంది.
ఫైర్ సిబ్బంది వద్ద…
హైదరాబాద్ పాతబస్తీలో ఘటన జరిగినను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒకరకంగా రాజకీయంగా వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది. కిషన్ రెడ్డి సాధారణంగా ఎప్పుడూ నోరు జారరు. చాలా ఆచితూచి మాట్లాడతారు. అలాంటి కిషన్ రెడ్డి సహాయ కార్యక్రమాలను అందించడంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే రాలేదన్నారు. అలాగే వారు వచ్చినా నీరు కూడా లేవని, ఆక్సిజన్ కొరత కూడా అగ్నిమాపక సిబ్బంది వద్ద లేవంటూ కిషన్ రెడ్డి అనడం కొంత ఇబ్బందికరంగా అనిపించింది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అనొచ్చు.అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని కోరవచ్చు. అంతేకాని ప్రభుత్వ సంస్థల ఆలస్యమే ప్రమాద తీవ్రతకు కారణమని అనడం సరికాదంటున్నారు.
ప్రభుత్వమే కారణమంటూ…
ఇక నిత్యం ప్రభుత్వంపై ఒంటికాలు మీద లేచే బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఒక అడుగు ముందుకేసి ఈ ప్రమాదానికి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వం అగ్నిప్రమాద శాఖపై సమీక్షచేయకపోవడం, ప్రభుత్వం అలసత్వమే ఇన్నిప్రాణాలు పోవడానికి కారణమని అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయన్న హరీశ్ రావుకు తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన ప్రమాదాల గురించి మర్చిపోయినట్లుంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అనేక చోట్ల అగ్నిప్రమాదాలు జరిగి పదులసంఖ్యలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ మరణించారు. కానీ నాటి ప్రమాదాలను మర్చిపోయి నేడు ప్రభుత్వవైఫల్యమంటూ నిందించడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు.మరో వైపు కాంగ్రెస్ మాత్రం ప్రమాదంపై రాజకీయాలు చేయవద్దని కోరుతుంది.