
Hyderabad Fire Accident: గుల్జార్ హౌస్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ..మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
Hyderabad Fire Accident: హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరణించినవారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రమాదం ఆదివారం ఉదయం 6 నుంచి 6.30గంటల మధ్య జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చాలా మంది స్ప్రహకోల్పోయిన పరిస్థితిలో గుర్తించారు. తర్వాత తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ ఈ ప్రమాదంలో 17 మంది మరణించినట్లు తెలిపింది. మరణించినవారిలో ప్రహ్లాద్ (70), మున్ని (70), రాజేందర్ మోడి (65), సుమిత్ర (60), హమీ (7), అభిషేక్ (31), షీతల్ (35), ప్రియాంష్ (4), ఇరాజ్ (2), ఆరోషి (3), ఋషభ్ (4), ప్రత్యమ్ (1.5), అనుయన్ (3), వర్ష (35), పంకజ్ (36), రాజిని (32), ఇడ్డూ (4) ఉన్నారు.
ఈ అగ్నిప్రమాదం భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రారంభమై పై అంతస్తులకు వ్యాపించింది. భారీగా పొగ కారణంగా కొంతమంది కళ్లు తిరిగి పడిపోయారు. అగ్నిఅదుపు, సహాయక చర్యల్లో 11 వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబో, 17 మంది ఫైర్ ఆఫీసర్లు 70 మంది సిబ్బంది పాల్గొన్నారు. గాయపడిన వారిని వెంటనే పలు ఆసుపత్రులకు తరలించారు. కేంద్రమంత్రి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎఐఎంఐఎం నేత ముమ్తాజ్ అహ్మద్ ఖాన్ కూడా అక్కడే ఉన్నారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించివారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ. 2లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 నష్టపరిహారాన్ని ప్రకటించారు.�