
అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయల్దేరిన ఎయిరిండియా విమానం… టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 274 మంది మృతి చెందారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగింది అనే వివరాలు తెలుసుకోవడానికి ఇప్పటికే బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేయకపోవడంతో విమానం కూలిపోక ముందు కాక్‌పిట్‌లో ఏం జరిగిందనేది మాత్రం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అయితే విమానం కూలిపోయే సమయంలో ఏటీసీతో పైలెట్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
ఏటీసీతో ఎయిరిండియా పైలెట్ చివరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘విమానంలో పవర్ లేదు. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. మేడే.. మేడే.. మేడే..’ అని పైలెట్ సుమత్ చెప్పారు. ఈ సంభాషణ ఏటీసీలో రికార్డు అయింది. థ్రస్ట్ అంటే విమానాన్ని ముందుకు నడిపే శక్తి. ఇది విమానం ఇంజిన్లు లేదా ప్రొపెల్లర్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. థ్రస్ట్ అనే పదానికి తెలుగులో నెట్టడం అనే అర్థం కూడా ఉంది. దీనితో ఈ విమాన ప్రమాదంలో ఇంజిన్ లేదా ప్రొపెల్లర్ ల వైఫల్యం కీలక పాత్ర పోషించినట్టు అర్థమవుతోంది. మరోవైపు ఈ ప్రమాదంపై కేంద్ర పౌరవిమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు అత్యున్నత కమిటీని ఏర్పాటుచేసేందుకు కేంద్రం సిద్ధమైంది.
విమానం తోక భాగంలో మృతదేహం లభ్యం
అహ్మదాబాద్ లోని ఎయిరిండియా విమానం కుప్పకూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈక్రమంలోనే శనివారం ఉదయం శిథిలాలను తొలగిస్తుండగా విమానం తోక భాగంలో మృతదేహాన్ని గుర్తించారు. దాదాపుగా విమానం మంటల్లో కాలిపోగా.. తోకభాగం మాత్రం భవనంపై చిక్కుకుపోయింది. శనివారం ఉదయం వాటిని తొలగిస్తుండగా.. ఓ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. అది విమానంలో విధులు నిర్వర్తించిన ఎయిర్‌హోస్టెస్‌లో ఒకరి మృతదేహం అని అధికారులు వెల్లడించారు.