
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయాలను బాగానే అలవర్చుకున్నారు. టచ్ మి నాట్ గా ఉండటానికి అనేక కారణాలున్నాయంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కనుచూపు మేరలో బాగుపడే అవకాశం కనిపించడం లేదు. అప్పులు చేయాలి. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలన్నా, నాలుగేళ్ల పాటు కొనసాగించాలన్నా చాలా కష్టమే. ఇప్పుడు సహకరించినట్లు కేంద్ర ప్రభుత్వం భవిష్యత్ లో సహకరించే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే దాని పరిమితులు దానికి ఉంటాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మరింత టైట్ చేసే అవకాశం కేంద్రంలో కనిపిస్తుంది.
తన శాఖకే పరిమితమవుతూ…
అందుకే పవన్ కల్యాణ్ ప్రతి విషయంలో పూసుకుని తిరగకుండా తన శాఖకే పరిమితమవ్వాలని నిర్ణయించుకున్నారు. కూటమి ప్రభుత్వమని అంటున్నా అది పూర్తిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికే వదిలేశారు. అంటే మంచి జరిగినా, చెడు జరిగినా అది చంద్రబాబు నాయుడు ఖాతాలోకే వెళుతుంది. అమరావతి విషయాన్ని తీసుకుంటే ఇంత నిధులు పెట్టి ఎందుకు ఖర్చు చేయడం అన్న ప్రశ్న జనసేనానిలోనూ ఉంది. కానీ అదే అమరావతి సక్సెస్ అయితే? అదే సంపద సృష్టించే కేంద్రంగా మారితే? అందుకే ఆయన ప్రతి విషయంలో మౌనం పాటించినట్లే రాజధాని అమరావతి నిర్మాణం విషయంలోనూ మౌనంగా ఉండాలని నిర్ణయించారట.
మళ్లీ భూసేకరణపై…
ఇటీవల చంద్రబాబు నాయుడు అమరావతి రైతులతో సమావేశమై మరో నలభై నాలుగు వేల ఎకరాల సమీకరణను చేయాలని, గ్రీన్ కోర్ ఎయిర్ పోర్టుతో పాటు అనేక వాటికి భూమి అవసరమని ఆయన రైతులతో చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొలుత సేకరించిన 33 వేల ఎకరాలే ఎందుకని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ దానికి తోడు నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని కూడా తప్పుపట్టలేదు. అలాగే బహిరంగంగా సమర్థించలేదంటున్నారు. మనకు సంబంధం లేని విషయంగా ఆయన వ్యవహరిస్తున్నట్లే కనపడుతుంది. భవిష్యత్ లో బూమ్ రాంగ్ అయినా తాను సమర్థించలేదని చెప్పుకోవడానికి వీలవుతుందని సైలెంట్ గా ఉన్నారనిపిస్తుంది.
సింహాచలం ఘటనపై…
ఒక్క అమరావతి మాత్రమే కాదు.. ఏ ఘటన జరిగినా పెద్దగా ఆయన స్పందించడం లేదు. తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడకు వెళ్లి ఊగిపోయిన పవన్ కల్యాణ్ నిన్న సింహాచలంలో గోడకూలి ఏడుగురు మరణిస్తే అక్కడకు వెళ్లకపోవడానికి కూడా కారణమదే అంటున్నారు. తాను అక్కడకు వెళితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందని, అందుకే అక్కడకు వెళ్లకుండా కామ్ గా ఉండి జరిగిన ఘటనను మాత్రం ఖండించారు. విచారాన్ని వెలిబుచ్చారు. పైగా హోంమంత్రి వంగలపూడి అనితను కూడా అక్కడ ఘటన జరిగిన తర్వాత తీసుకున్న చర్యలపై ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ కొంత దూరంగా ఉంటూనే పరిస్థితిని బట్టి తన మూవ్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.