
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత , హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ టర్కీకి గట్టి హెచ్చరిక చేశారు. పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే విషయంలో టర్కీ తన వైఖరిని పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు. భారత్‌తో టర్కీకి ఉన్న లోతైన చారిత్రక , సాంస్కృతిక సంబంధాలను ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు.
లద్దాఖ్ తో టర్కీకి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, గతంలో ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన అనుసంధానాన్ని ఒవైసీ ప్రస్తావించారు. 1920 వరకు ఉత్తర టర్కీ ప్రజలు లద్దాఖ్ మీదుగా భారత్‌కు వచ్చి, అక్కడి నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారని ఆయన తెలిపారు. అంతేకాకుండా 1990 వరకు లద్దాఖ్‌లో టర్కిష్ భాషను బోధించేవారని పేర్కొన్నారు. భారత్, టర్కీల మధ్య ఉన్న ఈ సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని టర్కీ విస్మరించకూడదని ఆయన హితవు పలికారు.
పాకిస్తాన్‌తో పోలిస్తే భారతదేశంలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉందని ఒవైసీ నొక్కి చెప్పారు. పాకిస్తాన్‌కు ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. భారతదేశంలోని కోట్లాది మంది ముస్లింలు గౌరవప్రదంగా, భౌతికంగా , సామాజికంగా మెరుగైన స్థితిలో జీవిస్తున్నారని, ఈ వాస్తవాన్ని టర్కీ గుర్తించాలని ఒవైసీ తమ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో కొన్ని అంతర్జాతీయ వేదికలపై టర్కీ పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో భారత్ అంతర్గత విషయాలపై టర్కీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒవైసీ చేసిన హెచ్చరికలు, టర్కీ వైఖరిపై భారత్ వైపు నుంచి, ముఖ్యంగా దేశంలోని ముస్లిం సమాజం నుంచి వస్తున్న స్పందనగా చూడాలి. భారతదేశంతో ఉన్న లోతైన సంబంధాలను విస్మరించి కేవలం పాకిస్తాన్ పట్ల మొగ్గు చూపడం టర్కీకి శ్రేయస్కరం కాదని ఒవైసీ పరోక్షంగా తేల్చి చెప్పారు.