విశాఖపట్నం పోలీసులు రుణ యాప్ ద్వారా అమాయకుల మెడకు రుణ ఉచ్చు బిగిస్తున్న ముఠాను గుర్తించారు. వీరికి సహకరించిన 16 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితులు అమాయకుల చేత 132 బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఖాతాల ద్వారా సుమారు 200 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
విశాఖపట్నానికి చెందిన ఒక వ్యక్తి గత ఏడాది రుణ యాప్ నుంచి 3,200 రూపాయలు తీసుకొని తిరిగి చెల్లించినప్పటికీ, సైబర్ నేరగాళ్లు వేధింపులు ఆపలేదు. దీంతో, ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి వాట్సాప్‌కు వచ్చిన బెదిరింపు సందేశాలను పరిశీలించగా, అవి పాకిస్తాన్‌లోని రావల్పిండికి చెందిన ఐపీ అడ్రస్ నుంచి వచ్చినట్లు తేలింది. లావాదేవీలు అస్సాం, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయని నిర్ధారించారు. దీంతో, పోలీసు బృందాలను ఆయా రాష్ట్రాలకు పంపించి, ఆ బ్యాంకు ఖాతాలు తెరిచిన ఆరుగురిని అరెస్టు చేశారు.
ఇదే కేసులో కర్నూలుకు చెందిన ఆర్. శ్రీనివాసరావును అరెస్టు చేసి విచారించగా, 30 బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అందించి 12 లక్షల రూపాయలు తీసుకున్నట్లు అంగీకరించాడు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వెల్లడించిన వివరాల ప్రకారం, రెండు అనుమానాస్పద వాట్సాప్ నంబర్లు గుర్తించారు. వీటి లాగిన్ ఐపీ అడ్రస్‌ను పరిశీలించగా, అవి పాకిస్తాన్‌లోని రావల్పిండి నుంచి ఆపరేట్ అయినట్లు తేలింది. ఫేస్బుక్లో ఒక ప్రమోషనల్ లింక్ ద్వారా ‘క్యాష్ బ్యాక్’ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా సెక్షన్ 94 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసు జారీ చేసి దర్యాప్తు చేపట్టగా, అస్సాంలోని హైలాకండిలో ఒక వ్యక్తి తెరిచిన ఇండియన్ బ్యాంకు ఖాతా నంబర్ లభించింది. ఈ ఖాతాలను వివిధ మోసాల కోసం ఉపయోగించినట్లు తేలింది. ఈ ఖాతాల్లోకి వచ్చిన నగదు మరో ఐదు వేర్వేరు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ రుణ యాప్ మోసంలో కనీసం 1,500 మంది బాధితులైనట్లు ఫిర్యాదులు అందాయి, మరికొందరు మోసపోయినా ఫిర్యాదు చేయలేదని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఏలూరుకు చెందిన అంజనా దేవిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన జి. సాంబశివరావు, అతని సహచరులైన ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో సాంబశివరావును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతను టెలిగ్రామ్ యాప్ ద్వారా చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు హంట్ మరియు ఆండీలతో సంప్రదింపులు జరిపాడు. వారు బ్యాంకు ఖాతాలను అందిస్తే, ఆ ఖాతాల్లో జరిగిన లావాదేవీల ఆధారంగా కోటి రూపాయలకు 1,60,000 రూపాయల కమీషన్ ఇస్తామని ఆశ చూపారు. దీంతో, సాంబశివరావు తన స్నేహితులైన కె. సందీప్, వై.వి. దిలీప్ కుమార్, జీవన్ సాయి, వై. సాయి కృష్ణ, ఆదర్శ్, శ్రీనివాస్, భరత్‌ల ద్వారా అమాయకుల నుంచి 132 బ్యాంకు ఖాతాలు తెరిపించాడు. ఈ ఖాతాలను చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లకు అందించారు.
ఈ 132 ఖాతాల ద్వారా సుమారు 200 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. బ్యాంకు ఖాతాలను విక్రయించడం ద్వారా సాంబశివరావు 4.5 కోట్ల రూపాయల కమీషన్ పొందినట్లు తేలింది. అతనితో పాటు దిలీప్, సందీప్‌ల మొబైల్ ఫోన్లను పరిశీలించగా, 60 లక్షల రూపాయల విలువైన క్రిప్టోకరెన్సీని గుర్తించి, స్పెషలైజ్డ్ హార్డ్‌వేర్ సహాయంతో జప్తు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
