
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజుకీ తీవ్రమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా రెండో వారంలోకి ఎంటరైన ఈ యుద్ధంలో ఇతర దేశాల ఎంట్రీపై తీవ్ర చర్చ మొదలైంది. ఇప్పటికే మరో రెండు వారాల్లో యూఎస్ ఎంట్రీపై క్లారిటీ వస్తుందని వైట్ హౌస్ వెళ్లడించగా.. ఇజ్రాయెల్ కు యూఎస్, జర్మనీ ఆయుధాలు పంపి, సహకరిస్తున్నాయి.
మరోవైపు.. ఇరాన్ కు రహస్యంగా చైనా కూడా మద్దతు తెలుపుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా… చైనా నుంచి బోయింగ్ విమానంలో ఇరాన్ కు రహస్యంగా ఆయుధాలు సరఫరా అయ్యాయనే కథనాలు అంతర్జాతీయ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా ఉత్తర కొరియా నియంత కిమ్ స్పందించారు. ఇజ్రాయెల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును… ఇజ్రాయెల్ తో తీవ్ర ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ కు మద్దతు తెలిపింది ఉత్తర కొరియా. ఈ సందర్భంగా స్పందించిన ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి.. ఇరాన్ పై ఇజ్రాయెల్ సైనిక దాడి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం జరిగే ప్రమాదాన్ని ఇజ్రాయెల్ లేవనెత్తుతోందని ఆరోపించారు.
ఇదే సమయంలో.. అమెరికా, పాశ్చాత్య దేశాల అండదండలతో ఉన్న ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో శాంతికి కేన్సర్ లాంటిదని, ప్రపంచ శాంతి భద్రతలను నాశనం చేయడంలో ప్రధాన దోషి అని సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ దారుణమైన దురాక్రమణ చర్యకు పాల్పడిందని విమర్శించారు కిమ్ ప్రతినిధి!
ఇలా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉత్తర కొరియా ప్రతినిధి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. ఈ యుద్ధంలో కిమ్ ఎంట్రీ ఉంటుందా అనే చర్చ మొదలైంది. అదే జరిగితే.. పరిస్థితులు ఎవరి ఊహకూ అందకపోవచ్చని అంటున్నారు.
కాగా… 1973లో ఆయుధ, అణు కార్యక్రమాల విషయంలో అమెరికా, పాశ్చాత్య దేశాల నుండి ఆంక్షలను ఎదుర్కొన్న నాటి నుంచి ఇరాన్, ఉత్తర కొరియాలు సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.