
న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. హిట్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందించబడింది. షైలేష్ కొలను దర్శకత్వం వహించగా, నాని పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించాడు. హింసాత్మక దృశ్యాలున్నాయన్న విమర్శలు వచ్చినా సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి రూ.150 కోట్ల క్లబ్‌లోకి చేరిన హిట్‌గా నిలిచింది. తాజాగా ఓటీటీలో కూడా విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా మంచి స్పందనను అందుకుంటోంది.
అయితే ‘హిట్ 3’ కథను తాను రాసినదని ఒక రచయిత ఆరోపిస్తూ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. విమల్ సోనీ అనే మహిళా రచయిత ‘ఏజెంట్ 11’ అనే కథ ఆధారంగా హిట్ 3 తెరకెక్కించారని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో హిట్ 3 మూవీ కాపీ వివాదంలో ఇరుక్కొంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కూడా శైలేష్ కొలను కథలు ఇతర కథల నుంచి కాపీ చేశాడన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇంతకీ విమల్ సోనీ ఆరోపణల ప్రకారం, ఆమె రాసిన కథలో ఉన్న కొన్ని ముఖ్యమైన మలుపులు, పాత్రల ఫ్లాష్‌బ్యాక్‌లు, కథనం మొత్తం హిట్ 3లో కనిపిస్తున్నాయట. అంతేకాదు, ఇందులోని కొన్ని సన్నివేశాలు ఓ ప్రముఖ తెలుగు సీరియల్లో కనిపించినవేనని చెప్పడంతో పాటు స్క్విడ్ గేమ్‌కు పోలికలు చూపిస్తూ ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఈ వివాదంపై నాని సైడ్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ టీం మాత్రం అంతర్గతంగా చర్చలు జరుపుతుందని తెలుస్తోంది.
ఇక ఈ వివాదంలో ప్రత్యేకత ఏమిటంటే.. విమల్ సోనీ నాని పెద్ద అభిమాని. ఆమె సోషల్ మీడియాలో నాని సినిమాలపై పాజిటివ్‌గా పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే, తన కథను సూటిగా తీసుకుని సినిమా చేశారన్న అభిప్రాయంతో ఆమె కోర్టు ముఖం పట్టింది. ఈ కేసు విచారణ ఎప్పుడు జరుగుతుందో తెలియాల్సి ఉంది కానీ, సినిమా మీద ఇలాంటి ఆరోపణలు రావడం దర్శకుడు షైలేష్ కొలను, నిర్మాతలకు పెద్ద చిక్కుగా మారే అవకాశముంది.
వాస్తవానికి హిట్ 3 పోస్టర్, టీజర్, సినిమా నేరేషన్ అన్నీ కథలో వేరు తనాన్ని చూపించినప్పటికీ ఇప్పుడు కథ కాపీ అంటూ వివాదం మొదలవడంతో ప్రేక్షకులలో కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. మద్రాస్ హైకోర్టు ఈ విషయంపై విచారణ చేపడితే చిత్ర యూనిట్ దీనిపై బలమైన స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు నాని మాత్రం ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ మూవీపై మంచి అంచనాలున్నాయి.