
MLA Adinarayana Reddy: జమ్మలమడుగు( jammalamadugu ) బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలి చర్చకు దారితీస్తోంది. గత కొద్దిరోజులుగా స్థానిక పరిశ్రమల యాజమాన్యాలకు, ఆయనకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది నేతలతో సైతం ఆయన వివాదాలు పెట్టుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన అనంతపురం జిల్లాకు చెందిన టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులతో వివాదం నడిచింది. అక్కడకు కొద్ది రోజుల తరువాత సొంత పార్టీ ఎంపీ సీఎం రమేష్ తో సైతం విభేదించారు ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని ఆరోపిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తులకు సంబంధించి ముడుసరుకుల రవాణాను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. తనది తప్పని తేలితే రాజకీయాలనుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు.
* స్థానికులకు అవకాశం ఇవ్వాలని..
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో అల్ట్రాటెక్ సిమెంట్( UltraTech Cement factory) ఫ్యాక్టరీ ఉంది. అయితే ఆ కంపెనీలో స్థానికులకు అవకాశం ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి కోరుతున్నారు. అయితే ఇప్పటికే కంపెనీలో కాంట్రాక్ట్ పనులకు సంబంధించి గడువు ఉంది. కానీ దానితో సంబంధం లేకుండా తన వర్గీయులకు పనులు కేటాయించాల్సిందేనని ఆయన తేల్చి చెబుతున్నారు. సంబంధిత యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఫ్యాక్టరీ ఉత్పత్తులు, ముడి సరుకుల రవాణాను అడ్డుకుంటున్నారన్నది ఒక ప్రచారం. ఇదే విషయంపై సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు మీడియాకు సమాచారం ఇచ్చింది. అలా వెలుగులోకి వచ్చింది ఆ వివాదం. దీనిపై ఆదినారాయణ రెడ్డి స్పందిస్తూ త్వరలో చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
* కూటమికి తలనొప్పిగా..
కొద్ది రోజులుగా ఆదినారాయణ రెడ్డి( Aadhi Narayana Reddy ) వ్యవహారం కూటమికి తలనొప్పిగా మారింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫ్యాక్టరీల యాజమాన్యాలపై జులుం ప్రదర్శిస్తున్నారంటూ ఆదినారాయణ రెడ్డి పై విమర్శలు ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలకు అవసరమైన ముడుసరుకు సరఫరా కాంట్రాక్టులతో పాటుగా అన్ని రకాల కాంట్రాక్టులు తన వారికే ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే స్థానికుల తరుపున పోరాడుతున్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
* గతంలో ఇండియా సిమెంట్స్ పరిధిలో..
జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల, చిలమకూరులో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యూనిట్లు ఉన్నాయి. ఇది గతంలో ఇండియా సిమెంట్స్( India Cements ) ఆధీనంలో ఉండేవి. గత ఏడాది నుంచి అల్ట్రాటెక్ యాజమాన్యం పరిధిలోకి వెళ్లాయి. అయితే ఈ యూనిట్లకు ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా జరగకుండా ఇటీవల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఈ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. వాటిని ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకోవడం వివాదంగా మారింది. లారీలను నిలిపివేయడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సంబంధిత యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. మీడియాలో పతాక శీర్షికన కథనాలు రావడంతో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు. ఇందులో తన తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు.