మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు చత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్ ఖాతాలో ధృవీకరించారు. దీంతో మావోయిస్టులకు భారీగా ఎదురు దెబ్బ తగిలిన్లయింది. గత కొన్ని నెలలుగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. భద్రతాదళాలతో పాటు స్థానిక పోలీసులు సంయుక్తంగా కలిసి నిర్వహించిన అనేక ఎన్ కౌంటర్లలో గత మూడు నెలల్లోనే మూడు వందల మంది వరకూ మావోయిస్టులు హతమయ్యారు. అగ్రనేతలు అందరూ వరసగా మృతి చెందడంతో మావోయిస్టులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. 2026 నాటికి మావోయిస్టులను సమూలంగా ఏరివేస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు నిజమవుతున్నాయి. అందులో భాగంగానే ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో మకాం వేసిన మావోయిస్టులపై గత కొన్ని నెలలుగా భద్రతాదళాలు విరుచుకుపడుతున్నాయి.
పక్కా సమాచారంతో….
మావోయిస్టులకు అన్ని రకాలుగా సాయం చేస్తున్న గిరిజనులను మచ్చిక చేసుకుని వారి ఆనుపానులను పసిగట్టి ఆ ప్రాంతంలోకి వెళ్లి మరీ ఎన్ కౌంటర్ చేసేస్తున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా కూడా మావోయిస్టులను ఏరివేస్తున్నారు. గత మూడు నెలల్లో మావోయిస్టులు ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం అంటే పక్కా ప్లాన్ తో ప్రభుత్వం ముందుగానే సమాచారం అందుకుని అదను చూసి మాటు వేసి వారిపై దాడులకు దిగడంతో మావోయిస్టుల ఎటూ తప్పించుకోలేకపోతున్నారు. వేసవి కాలం కావడంతో నీటి సమస్య, వ్యాధుల సమస్యతో పట్టణ ప్రాంతాలకు, సమీపంలోని గిరిజన ప్రాంతాలకు వచ్చే అవకాశముందని భావించిన భద్రతాదళాలు సమస్త సమాచారాన్ని సేకరించి వారిని అంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో భద్రతాదళాలు ఈ ఆపరేషన్ కొనసాగిస్తూ మావోయిస్టులను ఏరిపారేస్తున్నారు.
అంచెలంచెలుగా ఎదిగి…
మావోయిస్టుల్లో మాస్టర్ మైండ్ గా పేరున్న నంబాల కేశవరావు కూడా ఈ ఎన్ కౌంటర్ లో మరణించడంతో మావోయిస్టులు దాదాపు అంతమయిందన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. నంబాల శంకరరావు స్కెచ్ వేస్తే ఇక తిరుగుండదు. అనేక కేసుల్లో ఆయన సూత్రధారి. పాత్రధారి. నంబాల కేశవరావుపై కోటిన్నర రివార్డు కూడా ఉందంటే ఏ స్థాయి నేత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2010 సంవత్సరంలో బస్తర్ లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిలోనూ నంబాల కేశవరావుదే కీలకపాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018 పార్టీకి సుప్రీం కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావు పార్టీలో అంచెలంచెలంచెలుగా ఎదిగారు. గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో నంబాల కేశవరావు దిట్ట. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చేసిన నంబాల కేశవరావు ఎంటెక్ చేస్తున్న సమయంలో నక్సలిజానికి ఆకర్షితుయ్యాడు. 1983 నుంచి ఆయన అదృశ్య జీవితం గడుపుతున్నాడు.
అనేక కేసుల్లో…
1955లో శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేటలో కేశవరావు జన్మించారు. 1970ల నుంచే నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా ఉన్న కేశవరావు 1980లో ఒకసారి అరెస్ట్ అయిన నంబాల కేశవరావు 1987లో బస్తర్ అడవుల్లో కేశవరావు ఎల్టీటీఈ నుంచి శిక్షణ పొందారు. అంబుష్ టాక్టిక్స్, జిలెటిన్ హ్యాండ్లింగ్‌లో కేశవరావుకు శిక్షణ ఇచ్చారు. 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కేశవరావు 2018లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమును హతమార్చిన కేసులో కూడా నంబాల కేశవరావు స్కెచ్ వేశాడంటారు. చంద్రబాబు పై అలిపిరి లో దాడి కేసులోనూ ఆయన హస్తం ఉంది. నంబాల కేశవరావు మృతితో మావోయిస్టు ఉద్యమానికి భారీగా ఎదురుదెబ్బ తగిలింది.