
హైదరాబాద్ మెట్రోను చాలా మంది వినియోగించుకుంటున్నారు. మెట్రోలో ఆక్యుపెన్సీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వేళ వరకూ మెట్రో రైళ్లన్నీ రద్దీతో ఉంటున్నాయి. అయితే మెట్రో రైలు సంస్థ మాత్రం తమకు నష్టాలు వస్తున్నాయని గత కొన్నేళ్ల నుంచి చెబుతుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తట్టుకుని సొంత వాహనంలో ప్రయాణించడం కంటే మెట్రో రైలు ప్రయాణం సుఖవంతం. ఎప్పుడు బయటకు వెళ్లినా ట్రాఫిక్ కష్టాలు తప్పవు. శని, ఆదివారాలు కూడా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. వాహనాలు ముందుకు కదలడానికే ఇబ్బంది. ప్రధానంగా జూబ్లీహిల్స్, రాయదుర్గం, లక్డీకాపూల్, అమీర్ పేట్, కూకట్ పల్లి వరకూ ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా రద్దీయే.
గంటల కొద్దీ ప్రయాణం…
ఎల్బీ నర్ నుంచి నుంచి కూకట్ పల్లికి వెళ్లివచ్చేసరికి కారులో విజయవాడ వెళ్లొచ్చు అని ఛలోక్తులు కూడా వింటుంటాం. నిత్యం ట్రాఫిక్ రద్దీతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెట్రోలు కూడా అత్యధిక స్థాయిలో వినియోగం అవుతుంది. ఖర్చు ఎక్కువ అవ్వడంతో పాటు వాహనాల్లో వెళ్లడం కంటే మెట్రో రైలు ప్రయాణం సుఖంగా ఉందని అనేక మంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. నగరంలో ఎక్కడికైనా మెట్రో రైలులో ప్రయాణిస్తే అరగంటలో చేరుకునే వీలుంది. అందుకే మెట్రో రైలుకు హైదరాబాద్ లో మంచి ఆదరణ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం వరకూ అమీర్ పేట్ స్టేషన్ లో కాలు కూడా పెట్టలేం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మెట్రో రైళ్ల లోనే ప్రయాణిస్తారు. వీరితో పాటు సాధారణ, మధ్యతరగతి ప్రజలు కూడా మెట్రో రైలులో ఏసీలో సుఖంగా, సౌకర్యవంతంగా, వేగంగా గమ్యస్థానం చేరుకునే వీలుండటంతో అందరూ మెట్రో రైలునే వినియోగించుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో కొంత మైట్రో రైళ్లలో రద్దీ తగ్గిందని ప్రచారం జరుగుతుంది. ఫ్రీ బస్సు పథకం కారణంగా మెట్రో రైళ్లు నష్టాల్లో నడుస్తున్నాయన్న వాదన మొదలయింది. అయినా సరే మెట్రో రైళ్లలో రద్దీ ఏ మాత్రం తగ్గలేదు దీనికి తోడు మెట్రో రైలును 2026 తర్వాత అమ్మకానికి పెడుతున్నట్లు ఎల్ అండ్ టి సంస్థ అధ్యక్షుడు ఆర్ శంకర్ రామన్ గతంలో చేసిన ప్రకటన సంచలనం రేపింది కూడా. అయితే ఆ తర్వాత అది జరగలేదు.దీంతో పాటు కొత్త ప్రభుత్వం మెట్రో రైళ్లను విస్తరించాలని నిర్ణయించింది. ఇవన్నీ కలసి తమకు మరింత నష్టాలు తెచ్చి పెడతాయని భావించి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి మెట్రో రైలు ఛార్జీలను పెంచనున్నారు. పది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకూ ఛార్జీలు పెంచనుండటంతో మరి ప్రయాణికులు ఏ రకంగా తీసుకుంటారన్నది చూడాలి. గరిష్ఠ ధర అరవై రూపాయల నుంచి డెబ్భయి ఐదు రూపాయలకు పెంచనున్నారు.