
కేసీఆర్ మాట్లాడుతున్నారు అంటేనే జనం ఆసక్తి గా ఆయన స్పీచ్ కోసం టీవీలకు అతుక్కుపోయే వారు. ఆసాంతం ఆయన మాటలను వినేందుకు ఆసక్తి చూపేవారు. కానీ ఆదివారం మాత్రం ఆయన మాట్లాడుతుంటే ఆ ప్రసంగంలో పస లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అందుకు కారణాలు ఏమై ఉంటాయోనని వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ సాధారణంగా సభలో మాట్లాడేటప్పుడు లేదా విలేకరులతో ప్రెస్ మీట్లో ఎప్పుడు కూడా ఓ స్క్రిప్ట్ తీసుకొని వచ్చి అందుకు అనుగుణంగా మాట్లాడడం ఇప్పుడు చూడలేదు. కానీ ఎల్కతుర్తి సభలో మాత్రం స్క్రిప్ట్ చదివినట్లు కనిపించింది. అంటే అప్పటిలా కెసిఆర్ అనర్గళంగా మాట్లాడే సత్తువ కోల్పోయాడా, లేక ఆ విధంగానే మాట్లాడాలని ఆయనకు పార్టీ వర్గాలు సూచించి ఉంటారని భావిస్తున్నారు. కేసీఆర్ మాట్లాడుతుంటే మాటల తూటాలు ప్రత్యర్థి వర్గాన్ని ఉక్కిరి బిక్కరి చేసేలా ఉండేవి.
కానీ ఆ మ్యాగజైన్ లో తూటాలు మాయమయ్యాయి. ప్రభుత్వాన్ని విమర్శించాలని ఒకటి, రెండు విషయాలను ఎత్తుకొని వాటిపై రెండు మూడు వ్యాఖ్యలతో సరిపెట్టుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన అంశాలను టీవీలో చూసిన ప్రేక్షకులు ఏ విధంగా స్పందిస్తారో అలా స్పందించారు తప్ప తాను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదో జనాలకు స్పష్టంగా వివరించలేక పోయారు. చాలా నెలల తర్వాత బయటికి వచ్చారు ఆయన్ను చూడాలని, ఆయన ప్రసంగం వినాలని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన కార్యకర్తలకు ఏమైనా సందేశం ఇస్తారని, కార్యోన్ముఖులను చేస్తారని భావించారు. కానీ ఆవిధంగా కనిపించలేదు. సరైన రీతిలో ప్రసంగించకుండా ఏ శక్తులైనా ఆయన్ను అడ్డుకున్నాయి అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది. వేలాదిగా జనాన్నీ తరలించేందుకు ఎన్నో వ్యయప్రయాసలకు గురైన నాయకులు భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి మురిసిపోయారు తప్పా, ఈ సభతో ఒరిగే ప్రయోజనంపై మాత్రం పెదవి విరుస్తున్నారు. సభ విజయవంతమైనా.. కేసీఆర్ ప్రసంగంపై మాత్రం అసంతృప్తితో వెనుదిరిగినట్లు శ్రేణులే గుసగుసలాడుకుంటున్నారు.