
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మౌనంగానే ఉంటూ తాను అనుకున్నది సాధిస్తున్నట్లు కనపడుతుంది. పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు వరకూ కాస్త అగ్రెసివ్ గా కనపడేవారు. 2014 లో జనసేన పార్టీని పెట్టిన నాటి నుంచి ఆయన బహిరంగ సభల్లోనూ, రోడ్ షోల్లోనూ అన్ని పార్టీలపై విరుచుకుపడే వారు. తనకు ఒకసారి అధికారం ఇవ్వాలని పదే పదే కోరారు. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడించడంతో ఆయన ఆలోచన మారింది. 2014 తరహాలో కూటమిని ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వాన్ని అయితే గద్దెదించగలిగారు. పవన్ కల్యాణ్ అనుకున్నది సాధించారని, పట్టుదలతో ఆయన రాజకీయంగా తీసుకున్న వ్యూహాలు ఫలించాయన్న ప్రశంసలు అందుకున్నారు.
కూటమి హిట్ కావడంతో…
2024 లో సూపర్ కాంబినేషన్ తో కూటమి హిట్ అయింది. 164 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పార్టీ అయితే వందకు వంద శాతం స్ట్రయిక్ రేట్ ను సాధించింది. పోటీ చేసిన అన్ని శాసనసభ స్థానాల్లోనూ, పార్లమెంటు స్థానాల్లోనూ గెలుపొందింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ హర్ట్ కాకుండా అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ మైండ్ సెట్ తెలిసిన చంద్రబాబు అందుకు అనుగుణంగా ట్యూన్ అయ్యారు. పవణ్ ఏదీ తనకు కావాలని అడగరు. కానీ పవన్ ఆలోచనలను గుర్తించి చంద్రబాబు వాటిని అమలు చేస్తుండటంతో పవన్ కల్యాణ్ కూడా ఖుషీ ఫీలవుతున్నారు. ప్రధానంగా ఆయన తనకు కావాల్సిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను పట్టుబట్టి తీసుకున్నారు.
నోట్ వచ్చిందంటే…
ఆ శాఖకు సంబంధించి పవన్ నుంచి ఏదైనా నోట్ వచ్చిన వెంటనే దానికి సంబంధించిన నిధులు ఆగడానికి వీలులేదని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. పవన్ నుంచి వచ్చిన ఫైలు చూడాల్సిన పనిలేదని, నేరుగా తనకు ఆమోదం పంపాలని కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు చెప్పినట్లు టాక్. అందుకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించి పవన్ తీసుకున్న నిర్ణయాలతో పాటు ఆయన కోరిన నిధులను కూడా వెంటనే సమకూర్చుతున్నారు. మరొక వైపు మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ ను తన సోదరుడిగా సంభోదిస్తూ ఆయనకు మంచి గౌరవమిస్తూ కూటమి ట్రాక్ తప్పకుండా వ్యవహరిస్తున్నారు.
నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ…
ఇక ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ జనసేనకు ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా కలవకపోయినా నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఆయన నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే జనసేనకు నామినేటెడ్ పదవులు కేటాయిస్తూ వస్తున్నారు. ఇటు జనసేన కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలంటే ఆ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది పవన్ అభిప్రాయం. ఈ మేరకు భర్తీ అయ్యే పోస్టుల్లో అగ్రభాగం టీడీపీ తీసుకున్నప్పటికీ జనసేనకు కూడా తగినన్ని ఇస్తూ పవన్ కల్యాణ్ మాటకు ప్రభుత్వంలో తిరుగులేదన్న సంకేతాలను చంద్రబాబు సయితం బలంగా పంపుతున్నారు. మొత్తం మీద మౌనంగా ఉండి పవన్ తనకు కావాల్సిన రీతిలో అన్నీ సాధించుకుంటున్నారని, ఇదొక రకం వ్యూహమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారరు.