
కొన్ని విషయాల్ని ఓపెన్ గా చెప్పేయటం జగన్మోహన్ రెడ్డికి సుతారం ఇష్టం ఉండదు. మాటలకు భిన్నంగా చేతల్లో చేసి చూపిస్తారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన చేతలు ఆయన ఐదేళ్ల ప్రభుత్వంలో కొట్టొచ్చినట్లుగా కనిపించాయి. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న సవాళ్లకు ప్రతిగా రెడ్ బుక్ ను తెర మీదకు తీసుకొచ్చారు టీడీపీ ముఖ్యనేత నారా లోకేశ్. ఇంతకూ ఆ రెడ్ బుక్ లో ఏమున్నది? ఎవరి పేర్లు ఉన్నాయన్నది ఇప్పటివరకు బయటకు రాలేదు. అదే సమయంలో తాము రెడ్ బుక్ ను మర్చిపోలేదని.. రెడ్ బుక్ లో ఉన్న వారిని వదిలేది లేదన్న విషయాన్ని తరచూ లోకేశ్ చెప్పటం తెలిసిందే.
పలు సందర్భాల్లో టీడీపీ కార్యకర్తలు సైతం రెడ్ బుక్ సంగతేం చేశారంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడటం తెలిసిందే. ఈ ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉందంటే.. తాను రెడ్ బుక్ ను మర్చిపోలేదన్న విషయాన్ని లోకేశ్ తరచూ చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంతలా ఒత్తిడి ఉంది. ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి, తన ప్రభుత్వంలో ఎవరిని టార్గెట్ చేస్తున్న విషయాన్ని చెబుతున్నది లేదు. ఆయన తరచూ జగన్ 2.0 గురించి చెబుతున్నారు. అదెలా ఉంటుందో చెబుతున్నారే తప్పించి.. వివరాల లోతుల్లోకి వెళ్లటం లేదు
తాజాగా నిర్వహించిన మీడియా భేటీలో మాత్రం ఆయన లోకేశ్ రెడ్ బుక్ కు మించిన బ్లూ బుక్ ఒకటి రాస్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన నేతల్ని ఎంతలా ఇబ్బంది పెడుతన్నారో.. కేసులతో తిప్పలు పెడుతున్నారన్న విషయాన్ని ఆయన అక్షరం పొల్లుపోకుండా చెప్పటమే దీనికి నిదర్శనం. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న జగన్.. అందులో భాగంగా పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి.. ఆళ్ల రామక్రిష్ణారెడ్డి.. నందిగం సురేష్.. ఆయన సతీమణి.. వల్లభనేని వంశీ.. జోగి రమేష్ కొడుకు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి.. క్రిష్ణమోహన్ అన్న (జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీ).. ధనుంజయరెడ్డి.. రాజ్ కేసిరెడ్డి.. బాలాజీ.. గోవిందప్ప లాంటి వారిపై కేసులు పెట్టటం.. కొందరిని అరెస్టు చేసి బెయిల్ రాకుండా తిప్పలు పెడుతున్న అంశాల్ని ఏకరువు పెట్టారు.
తమ ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలని చూస్తున్నారన్న జగన్.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. పేర్ని నాని.. ఆయన సతీమణి జయసుధను ఇరికించాలని చూస్తున్నారన్న జగన్.. కొడాలి నాని.. జోగి రమేష్.. సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఆయన కొడుకు.. వైవీ సుబ్బారెడ్డి.. ఆయన కొడుకు.. దేవినేని అవినాష్.. తలశిల రఘురాం. అంబటి రాంబాబు.. విడదల రజిని.. తాటిపర్తి చంద్రశేఖర్.. బూచేపల్లి శివప్రసాద్.. ఉషాచరణ్.. తోపుదుర్తి ప్రకాష్.. గోరంట్ల మాధవ్.. గౌతంరెడ్డి.. మేరుగు నాగార్జున.. దాడిశెట్టి రాజా..ఇలా అందరిపైనా తప్పుడు కేసులు పెట్టి.. ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా? అని చూస్తున్నారన్నారు.
ఇటీవల సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఘటనను ప్రస్తావించిన జగన్.. ఆయన బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ఛెళ్లుమని ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు కీలకమని చెప్పాలి. ఎందుకంటే తన వాళ్లు.. తనకు సంబంధించి నష్టం కలిగించే వారి వివరాల్నిసేకరించే విషయంలో ఆయన ఎంత స్పష్టంగా ఉన్నారన్న విషయం అర్థమవుతుంది.
సాక్షి ఆస్తుల్ని టార్గెట్ చేసి విధ్వంసానికి పాల్పడ్డారంటూ కొన్ని ఫోటోల్ని చూపిస్తూ.. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ టౌన్ అధ్యక్షుడు మెట్టా శైలజా.. శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్ సతీమణి గుండు స్వాతి.. మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి.. తెలుగు యువత అధ్యక్షుడు మెండా దాసునాయుడు సాక్షి ఆఫీసుల మీద దాడి చేశారన్నారు. వీరే కాదు.. విశాఖ సాక్షి ఆఫీసు మీద విశాఖపట్నం నగర 26వ వార్డు టీడీపీ కార్పొరేటర్ ముక్కా స్వాతి.. టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి.. తూర్పుగోదావరి జిల్లా సాక్షి కార్యాలయంపై ఆనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి.. రాజానగరం్ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామక్రిష్ణ.. విజయవాడ సాక్షి ఆఫీసుపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు భార్య గద్దె అనురాధ.. గద్దె క్రాంతి.. మంగళగిరి సాక్షి ఆఫీసు మీద కంభంపాటి శిరీష.. అనంతపురం సాక్షి కార్యాలయంపై టీడీపీ మహిళా విభాగానికి చెందిన స్వప్న.. సంగ తేజస్వీని.. కడపలో బొజ్జ తిరుమలేను.. తిరుపతి రేణిగుంట కార్యాలయం పై తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునిక్రిష్ణ.. టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం.. నెల్లూరులో టీడీపీ సిటీ అద్యక్షురాలు రేవతి.. ఏలూరులో టీడీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతల వెంకటరమణ తదితరుల పేర్లను చెప్పటం గమనార్హం. ఇదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పేశారు.. తాను నోట్ చేస్తున్న పుస్తకం గురించని చెప్పక తప్పదు.