
* అనంతపురం జిల్లా భిన్నం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress party ) ఆవిర్భావం నుంచి రాయలసీమ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో టిడిపి కంటే ఎక్కువ సీట్లు రాయలసీమలో వైసిపి దక్కించుకుంది. 2019లో అయితే మూడు సీట్లు తప్పించి అన్ని స్థానాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ 2024 వచ్చేసరికి సీన్ మారింది. అయితే అనంతపురం జిల్లా మాత్రం ఎప్పుడు ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే అక్కడ పాగా వేయాలంటే కీలక నేతలను మచ్చిక చేసుకోవాలని చూశారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే సాకే శైలజానాధ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నారు. మరో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
* సుదీర్ఘకాలం కాంగ్రెస్ లోనే..
సాకే శైలజానాథ్( sake sailaja Naat ) కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 2004లో సింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో రెండోసారి గెలిచి సత్తా చాటారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాకే శైలజనాథ్ మంత్రిగా కూడా వ్యవహరించారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. అయినా సరే అదే పార్టీలో కొనసాగారు శైలజనాథ్. కాంగ్రెస్ హై కమాండ్ శైలజానాద్కు పిసిసి అధ్యక్ష పదవి కూడా అప్పగించింది. అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితేనే ప్రయోజనం అని సాకే శైలజనాథ్ భావించారు. కొద్ది నెలల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
* పార్టీలో చేరిన వెంటనే గుర్తింపు..
సాకే శైలజనాథ్ సేవలను వినియోగించుకోవాలని చూశారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో( political Advisory Committee ) కూడా ఆయనకు చోటిచ్చారు. తాజాగా సింగనమల వైయస్సార్ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమించారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగనమలలో ఓడిపోయింది. 2019లో మాత్రం జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో పద్మావతిని కాదని వీరాంజనేయులకు ఇక్కడ వైసిపి టికెట్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంలో వీరాంజనేయులు ఓడిపోయారు. అయితే ఎప్పటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా వీరాంజనేయులు ఉండేవారు. ఆయనను కాదని ఇప్పుడు సాకే శైలజానాధ్ ను ఇన్చార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి