
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పోటాపోటీగా విరుచుకుపడుతున్నాయి. గగనతలంలో ఇరు దేశాల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో.. పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకోంది. ఈ నేపథ్యంలో అక్కడి దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా… పలు విమానాశ్రయాలు మూతబడ్డాయి.
అవును… ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో… పశ్చిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. దీంతో… లెబనాన్, జోర్డాన్, ఇరాక్ లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇలా పశ్చిమాసియా వ్యాప్తంగా విమానాశ్రయాలు మూతపడటంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. అక్కడ నుంచి ఎలా బయటపడాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. సుమారు 10వేలకు పైగా ప్రయాణికులు ఇరాన్ సహా పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.
గురువారం అర్ధరాత్రి నుంచి తమపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడటంతో టెహ్రాన్ శివార్లలో ఉన్న దేశంలోని ప్రధాన ఖొమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాలను ఇరాన్ నిలిపివేసింది. దీంతో.. ఇరాన్ లో ఉన్న భారత్ సహా ఇతర దేశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు, పౌరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది.
ఈ సమయంలో.. అక్కడి నుంచి తమ పౌరులను తరలించేందుకు భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా 100 మందితో కూడిన మొదటి బ్యాచ్ ఇప్పటికే టెహ్రాన్ నుంచి బయల్దేరింది. ప్రస్తుతం అక్కడ సుమారుగా 10 వేల మంది భారతీయలు ఉన్నారని.. అందులో 6 వేల మంది వరకు విద్యార్థులేనని తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ… ప్రస్తుతం గగనతలం మూసివేసినందున.. భూసరిహద్దుల మీదుగా తమ పౌరులను, విద్యార్థులను తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. దీంతో ఆర్మేనియా, అజర్ బైజాన్, తుర్కమెనిస్థాన్, అఫ్గానిస్థాన్ మీదుగా భారత్ కు తరలించనున్నారు.
ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ సైతం తమ దేశంలోని అత్యంత కీలకమైన బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. దీంతో.. సుమారు 50 వేల మందికి పైగా ఇజ్రాయెల్ ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ ప్రజలు జోర్డాన్, ఈజిప్ట్ తో ఉన్న సరిహద్దుల ద్వారా దేశం విడిచి వెళ్లొద్దని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు.