
ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో భీకర వాతావరణం నెలకొంది. మరోపక్క ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం భారత్ లోని చమురు ధరలపై ఎలా ప్రభావం, ఎంతటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది.
అవును.. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో భీకర యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఇంధన మార్కెట్లను కుదిపేస్తాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. కీలకమైన పశ్చిమాసియా ప్రాంతం నుంచి ఇంధన సరఫరాలకు అంతరాయం కలగనుందనే ఆందోళనల మధ్య చమురు ధరలు ఇప్పటికే పెరిగాయని చెబుతున్నారు.
ఇందులో భాగంగా… శనివారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు 6 డాలర్లకు పైగా పెరిగి ఐదు నెలల గరిష్ట స్థాయి 78 డాలర్లను దాటింది. ఇలా ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఇంధన ఖర్చులు పెరగడం, సరుకు రవాణా ఖర్చులు పెరగడం జరుగుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రభావాలు అమెరికా ఈక్విటీలలో కూడా తీవ్ర పతనానికి దారితీశాయని అంటున్నారు.
ఈ సందర్భంగా ఎస్&పీ గ్లోబల్ కమోడిటీ ఇన్ సైట్స్ లో చమురు విశ్లేషణ అధిపతి రిచర్డ్ జోస్విక్ స్పందిస్తూ… చమురు ఎగుమతులపై ఈ దాడి ఎలా ప్రభావితం అవుతాయనేది చాలా కీలకం అని అన్నారు. గతసారి ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు జరిగినప్పుడు ధరలు పెరిగాయని.. తర్వాత పరిస్థితి కాస్త మెరుగు పడటంతో సరఫరా ప్రభావితం కాలేదని తెలిపారు.
వాస్తవానికి.. ఇరాన్ నుంచి భారత్ పెద్ద మొత్తంలో నేరుగా దిగుమతి చేసుకోనప్పటికీ.. దాని చమురు అవసరాలలో 80% దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి అని గుర్తు చేస్తున్నారు.
ఇదే సమయంలో.. ఇరాన్ – అరేబియా ద్వీపకల్పం మధ్య ఉన్న హార్మూజ్ జలసంధి భారత్ కు ఆందోళన కలిగించే అంశం అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ప్రపంచ ఎల్.ఎన్.జీ. వాణిజ్యంలో సుమారు 20 శాతం, ముడి చమురు ఎగుమతుల్లో గణనీయమైన భాగం ఈ ఇరుకైన జలమార్గం ద్వారా రవాణా చేయబడుతోంది.
ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధి చుట్టూ ఏదైనా అంతరాయం ఏర్పడితే.. అది భారతదేశ కీలక సరఫరాదారులైన ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ ల నుంచి చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ మార్గాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే.. ఖర్చు, సమయం పరంగా భారత్ ఎగుమతులను దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.