
ఐపీఎల్ లో చివరి అంకం దాదాపుగా వచ్చేసింది. మే నెలలోకి ప్రవేశించడంతో ఇక ఐపీఎల్ మ్యాచ్ లు ముగింపు దశకు వచ్చినట్లే. ఈ సమయంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటిలాగానే పేలవమైన ప్రదర్శన చేసింది. ఈ సీజన్ ఎందుకో కాని చెన్నై సూపర్ కింగ్స్ కు అచ్చిరాలేదు. అన్నీ ఓటములే.. ఎన్నిసార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు ఇలా అయిపోయిందన్న బాధ తప్ప ఆటలో ఇవన్నీసాధారణం అనుకోవాలి అంతే తప్ప చేసేదేమీ లేదన్నట్లు దాని తీరు తయారయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఒకప్పుడు ఆడుతుందంటే విజయం దాని వెంటే ఉండేది. కానీ ఈ సీజన్ లో మాత్రం ఏ జట్టు అయినా దానిని తేలిగ్గా తీసుకోగలిగి సొంత మైదానమైన చైన్నైలోనే ఓడించి ఇంటికి పంపుతుంది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసుకు దూరమయిందనే చెప్పాలి.
190 పరుగులు చేసినా…
చెన్నైలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ లోఆరంభంలోనే బ్యాటర్లు తడబడ్డారు. రషీద్ పదకొండు పరుగులకు అవుట్ కాగా, ఆయుష్ మాత్రే ఏడు పరుగులకు వెనుదిరిగాడు. దీంతో సామ్ కరన్ కొంత నిలకడగా ఆడి 88 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ పరువు నిలిపాడు. జడేజా పదిహేడు పరుగులకే అవుట్ కాగా, బ్రైవిస్ 32 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. శివమ్ దూబే కూడా ఈ సీజన్ లో పెద్దగా పెర్ ఫార్మ్ చూపించింది లేదు. దూబె ఆరు పరుగులు, ధోని పదకొండు, దీపక్ హుడా రెండు పరుగుల చేసి ఇన్నింగ్స్ ను ముగించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో190 పరుగులు చేశారు.
సులువుగానే ఛేదించి…
ఇక 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఈ స్కోరు సాధించడం కష్టమని అందరూ భావించారు. ఎందుకంటే చెన్నైను సొంత గడ్డపై ఓడించడం కష్టమేనని అందరూ అనుకున్న వేళ పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ప్రియాంశ్ ఆర్యా 23 పరుగులు చేశాడు. ప్రభ్ సిమ్రాన్ 54 పరుగులు చేసి జట్టుకు మంచి ఊపు అందించాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ 72 పరుగులు ఆడటంతో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై సులువుగా విజయం సాధించినట్లయింది. పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ పది మ్యాచ్ లు ఆడి ఆరో విజయాన్ని సాధించి పాయంట్ల పట్టికలో రెండో స్థానానికి వెళ్లింది.