
నేడు ఇండియా – పాక్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. హాట్ లైన్ మధ్య ఇరుదేశాలకు చెందిన సైనికాధికారులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చర్చించనున్నారు. అయితే పాక్ ను ఎంత వరకూ నమ్మొచ్చన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా పాక్ వంకరబుద్ధి గురించి అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ సమాజం కూడా పాక్ కుటిల బుద్ధిని తెలిసి కూడా దుష్టుడికి దూరంగా ఉండాలని మౌనంగా ఉంటోంది. అయితే పాక్ తో చర్చలు అంటే శాంతి కోసమే అయినా అది ఎంత మేరకు మాట మీద నిలబడుతుందన్నది మాత్రం అనుమానమేనంటున్నారు.
ఉగ్రవాదులను అప్పగిస్తుందా?
ఎందుకంటే గత అనుభవాలు మనకు అనేక విషయాలు నేర్పాయి. అనేక సార్లు పాక్ దిగివచ్చినట్లు కనిపించినట్లు నటించి తిరిగి ఉగ్రవాదులతో భారత్ పై దాడులు చేయిస్తూనే ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ఈ చర్చల్లో ముఖ్యంగా ఉగ్రవాదులను తమకు అప్పగించాలన్న డిమాండ్ ను పెట్టనుంది. అయితే పాక్ మాత్రం అందుకు ఎంత మాత్రం సుముఖత వ్యక్తం చేయదన్నది అందరికీ తెలుసు. తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పాక్ వెనక్కు తగ్గింది కానీ లేకుంటే ఎవరి రాయబారాలకు తలొగ్గే ఘటం కాదన్నది కూడా అందరికీ తెలుసు. అందుకే ఉగ్రవాదులను అప్పగించాలన్న భారత్ డిమాండ్ ను మాత్రం పాక్ తలూపినట్లే ఊపి తిరిగి మామూలు పరిస్థితికి చేరుకుంటుందన్నది విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.
బెదిరింపులతోనే…
యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. భారత్ కూడా యుద్ధం జరిపితే పై చేయి అవ్వొచ్చేమో కాని ఆర్థికంగా నష్టం కూడా భారత్ కు అంతే స్థాయిలో ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. పాక్ ను బెదిరింపులతో లొంగదీసుకోవడమే మంచిదని పలువురు సూచిస్తున్నారు. అయితే బెదిరింపులకు లొంగే దేశం పాక్ కాదన్నది కూడా అందరికీ తెలుసు. యుద్ధం అనివార్యమయితే తప్ప అదిఆఖరి అస్త్రంగానే చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దశలో పాక్ కూడా సింధూ జలాల విషయంలో తమకు అనుకూలంగా వ్యహరించాలని కోరనుంది. కానీ భారత్ మాత్రం ఇప్పటికే దానిపై పునరాలోచన చేసే ప్రసక్తి లేదని తెలిపింది. మరి నేడు జరిగే చర్చలు ఏ రకంగా ముందుకు వెళతాయన్నది మాత్రం సందేహమే అయినప్పటికీ.. యుద్ధం శాశ్వత పరిష్కారం కాదు.. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి కనుక వాటిని కొనసాగించాల్సిందే.