
చాలా ఏళ్లుగా హైదరాబాద్ లో ఒకే ఒక ఐమాక్స్ స్క్రీన్ ఉండేది. హైదరాబాద్ లో ప్రసాద్ మల్టీప్లెక్స్ పేరుతో ఒకటే ఐమాక్స్ ఉండేది. సినీ ప్రియులకు, ఈ ఐమాక్స్ అనేది కేవలం ఒక సినిమా థియేటర్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్ కూడా. అందులో సినిమా చూడటం కోసం సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎంతో ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. ఐమాక్స్ స్క్రీన్ లో సినిమా చూడటమంటే ఆ స్క్రీన్ పై విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ తో ఆడియన్స్ నెక్ట్స్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ను ఎంజాయ్ చేస్తారు.
కానీ ఆ సువర్ణాధ్యయం ముగిసింది. దీంతో తర్వాత నుంచి ఐమాక్స్ విషయంలో నిశ్శబ్ధం నెలకొంది. భారతదేశంలోని అతి పెద్ద సినీ మార్కెట్లలో ఒకటిగా ఉన్నప్పటికీ, హైదరాబాద్ లో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా లేకుండా పోయింది. సంవత్సరాలు గడుస్తున్నా ఇదేమీ మారలేదు. ఈ లోపు ఐమాక్స్ టెక్నాలజీ చాలా వేగంగా డెవలప్ అయింది.
ఐమాక్స్ కంపెనీ కొత్త ప్రమాణాలతో, మరింత గొప్ప సౌండ్ సిస్టమ్తో కొత్తగా రూపాంతరం చెంది. దీంతో కొత్త ఐమాక్స్ స్క్రీన్ ను ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు భారీ పెట్టుబడితో పాటూ సరికొత్త సాంకేతికత అవసరం. ఈ కారణంతోనే ఎన్నో థియేటర్లు వెనుకడుగు వేశాయి. ప్రసాద్స్ కూడా తమ ఐమాక్స్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి బదులుగా తమ సొంత ఫార్మాట్ PCXను మొదలుపెట్టింది.
అయితే హైదరాబాద్ అలానే నిలిచిపోగా, ఇతర నగరాలు మాత్రం ఐమాక్స్ విషయంలో చాలా ముందుగా దూసుకెళ్తున్నాయి. చెన్నై, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లలో ఇప్పుడు పలు ఐమాక్స్ స్క్రీన్లున్నాయి. కోయంబత్తూరు, ఇండోర్ లాంటి టైర్2 సిటీల్లో కూడా ఐమాక్స్ స్క్రీన్లున్నాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం ఐమాక్స్ స్క్రీన్ లేదు. ఈ బాధను మరింత పెంచుతూ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఐమాక్స్ వెర్షన్ లో సినిమాలను తీస్తున్నారు.
బాలీవుడ్ బ్లాక్బస్టర్లు, కల్కి లాంటి సైన్ ఫిక్షన్ సినిమాలు, ప్రాంతీయ సినిమాలను కూడా ఇప్పుడు ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాలతో షూట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఈ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటే హైదరాబాదీలు మాత్రం వాటిని చూడలేకపోతున్నారు. హైదరాబాద్ నగర వాసులు కల్కి సినిమాను పూర్తిగా చూసే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో చాలా మంది తర్వాత ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. SSMB29 పూర్తిగా ఐమాక్స్ ఫార్మట్ లోనే షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరూ మన తెలుగు సినిమాను ఐమాక్స్ వెర్షన్ లో చూసి ఎంజాయ్ చేస్తే మన హైదరాబాదీలు ఈ సినిమాను ఎలా చూడాలని అందరూ నిరాశ పడుతున్న టైమ్ లో ఇప్పుడో కొత్త ఆశ చిగురిస్తుంది.
ఐమాక్స్ ను తిరిగి హైదరాబాద్ కు తీసుకురావడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయని ఏషియన్ గ్రూప్ కు చెందిన సునీల్ నారంగ్ తెలిపారు. రాబోయే రెండేళ్లలో హకీంపేటలో కొత్త స్క్రీన్ ను ఏర్పాటు చేయాలని ప్లాన్స్ జరుగుతున్నాయని, అన్నీ సవ్యంగా జరిగితే హైదరాబాద్ లో మరోసారి ఐమాక్స్ స్క్రీన్ లో సినిమా చూసే అవకాశం ఉంటుంది. సినిమాను ఊపిరిగా భావించే హైదరాబాద్ లాంటి నగరానికి ఈ ఐమాక్స్ స్క్రీన్ స్పెషల్ అడిషన్ అవడం ఖాయం. తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఐమాక్స్ స్క్రీన్ పునరాగమనం ఎంతో అవసరం.