
Hamas jaisa attack: పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఉద్రేకం రేపుతోంది. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనపై ఢిల్లీలో జరిగిన ‘జన ఆక్రోశ్ ర్యాలీ’లో బీజేపీ నేత రమేశ్ బిధూరీ ఆగ్రహంతో స్పందించారు. హమాస్ తరహాలో దాడి జరిగితే, ఇస్రాయెల్ తరహాలో ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తమపై దాడి చేసిన వారిని ఊహించని విధంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. పహల్గాం ఘటనపై భారత్‌లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్‌పై ఆగ్రహంతో కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా స్పందించింది. ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దు మూసివేసింది. అంతేకాకుండా, ఏప్రిల్ 27 నుంచి భారత ప్రభుత్వం అన్ని పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్లో ఉన్న భారతీయులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని సూచించింది.
ఇక పాకిస్తాన్ అధికార ప్రతినిధి కల్నల్ తైమూర్ రహత్ లండన్‌లో భారతీయులపై తలనరికి వేయడాన్ని సూచించే చేతి సంకేతం చేశాడు. లండన్‌లో భారతీయులు నిర్వహించిన పహల్గాం ఉగ్రదాడిపై నిరసన కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీనిపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తీవ్రంగా మండిపడ్డారు. అలాంటి సంజ్ఞలు చూపుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అలాగే పహల్గాం దాడి జరిగిన తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ వద్ద ఒక వ్యక్తి కేక్ తీసుకెళ్తున్న వీడియో వైరల్ కావడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై స్పందించిన సిర్సా, అలాంటి వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, భారత సైన్యం వారిని తగిన విధంగా సమాధానం ఇస్తుందని అన్నారు. ఇలా దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌పై ఆగ్రహం ఉప్పొంగుతుండగా, భారత ప్రభుత్వం ఆ దేశంపై దౌత్యపరమైన, సైనికపరమైన ఒత్తిడిని పెంచే దిశగా స్పష్టమైన సంకేతాలు పంపిస్తోంది.